Big TV AI News Anchor: ప్రతిమా, రిను, శాంతి స్వరూప్ ను దాటి.. “ఏఐ మాయ”లోకి వచ్చేశాం

ఈ డిజిటల్ యాంకర్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వార్తలు చదువుతుంది. అయితే ఆ స్క్రిప్టులో తప్పులు లేకుండా ఉండాలి. ఇలాంటి డిజిటల్ యాంకర్ విధానాన్ని టీవీ9 తెరపైకి కనుక తీసుకొస్తే "రుధిరం, పోస్కో, టాల్కం పౌడర్" వంటి వాటి నుంచి తెలుగు ప్రేక్షకులు దాదాపు రక్షణ పొందినట్టే.

Written By: K.R, Updated On : July 13, 2023 8:30 am

Big TV AI News Anchor

Follow us on

Big TV AI News Anchor: ప్రతిమ పూరి అందంలో ఆమెకు ఆమే సాటి. బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలంలో ఆమె వార్తలు చదువుతుంటే వినసొంపుగా ఉండేది.. రినూ సైమన్ ఇంగ్లీషులో వార్తలు చెబుతుంటే తెల్లోల్ల భాషను త్వరగా నేర్చుకోవాలి అనిపించేది. ఆ ఉచ్చారణ చూస్తే ఎంత అనర్ఘళంగా మాట్లాడుతోందో అనిపించేది. శాంతి స్వరూప్ వార్తలను చెబుతుంటే అలానే చూడాలి అనిపించేది. అతడు పలుకుతున్న తీరును చూసి బ్లాక్ అండ్ వైట్ టీవీకి అతుక్కుపోవాలి అనిపించేది. అక్కడి నుంచి వార్తల ప్రయాణం రకరకాల వ్యాఖ్యాతల మీదుగా సాగుతూనే ఉంది. విషయం ఆధారంగా ఉచ్ఛరించే వ్యాఖ్యతల నుంచి.. ఆకాశంలో కురుస్తున్న వర్షాలను రుధిరంతో పోల్చే వాగాండబరం దేవి ల వరకు వచ్చేసింది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో అది మరింత ముందడుగు వేసింది. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్టు.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం “బిగ్ టీవీ మాయ”లను మనకు పరిచయం చేసింది.

బిగ్ టీవీ చేసి చూపించింది

వాస్తవానికి తెలుగు ప్రేక్షకులకు 24 గంటల పాటు వార్తలు అందించే ఛానల్ గా టీవీ9 ప్రారంభమైంది. మొన్నటిదాకా నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. వార్తల ఛానల్ అయినప్పటికీ రకరకాల ప్రయోగాలు చేసింది. అవి వికటించి నవ్వుల పాలైనా సరే ప్రేక్షకులకు ఏదో రూపంలో కొత్తదనాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక ఆ మధ్య ఇంగ్లీషు, ఒడిస్సా భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన డిజిటల్ యాంకర్ ను తీసుకొచ్చారు. వాటి మాదిరిగానే టీవీ9 కూడా తీసుకురావాలని అనుకుంది. ఆ ఛానల్ లో ఉన్న పెద్ద తలకాయలు దీనిని అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్యనే రజినీకాంత్ కుడి భుజం ఒకతను టీవీ9 వదిలేసి బిగ్ టీవీలో జాయిన్ అయ్యాడు. టీవీ9లో ఈ డిజిటల్ యాంకర్ ఆలోచనలు తెరపైకి వచ్చినప్పుడు అతడు అప్పుడు అక్కడే ఉన్నాడు. తర్వాత బిగ్ టీవీలో ఆ డిజిటల్ యాంకర్ కు ఊపిరి పోసాడు. వాస్తవానికి చిన్న చిన్న టీవీల్లో నిజమైన యాంకర్ కు, ఈ కృత్రిమ మేథ యాంకర్ కు పెద్ద తేడా ఉండదు. పైగా సంప్రదాయబద్ధమైన డ్రెస్ వేయడంతో బిగ్ టీవీ తెలుగు మాయ చాలా పద్ధతిగా ఉంది. వాయిస్ కూడా క్లియర్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అయ్యారు. అన్నింటికీ టీవీ9 అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. అప్పుడప్పుడు బిగ్ టివి లాంటి చిన్న చిన్న చానల్స్ కూడా ప్రయోగాలు చేస్తుంటాయి. కాకపోతే అవి నవ్వుల పాలు కావు.

రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే

ఈ డిజిటల్ యాంకర్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వార్తలు చదువుతుంది. అయితే ఆ స్క్రిప్టులో తప్పులు లేకుండా ఉండాలి. ఇలాంటి డిజిటల్ యాంకర్ విధానాన్ని టీవీ9 తెరపైకి కనుక తీసుకొస్తే “రుధిరం, పోస్కో, టాల్కం పౌడర్” వంటి వాటి నుంచి తెలుగు ప్రేక్షకులు దాదాపు రక్షణ పొందినట్టే. నిజానికి మొన్న ఓ టీవీ ఛానల్ వాళ్ళు లీసా పేరిట ఈ యాంకర్ ను తీసుకొచ్చారు. కానీ బిగ్ టీవీయే తొలిసారి ఇండియన్ టీవీ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ ను తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ యాంకర్ కు మాయ అనే పేరు కూడా పెట్టింది. ఆ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు సొంతంగా సమకూర్చుకున్నారు. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే బిగ్ టీవీలో మాయ కనిపించే లోపే ఓ టీవీ ఛానల్ లిసా అనే డిజిటల్ యాంకర్ ను పరిచయం చేసింది. సో సౌత్ ఇండియాలో తొలి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ యాంకర్ ను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం బిగ్ టివి దక్కించుకుంది. అయితే ఇక్కడే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డిజిటల్ యాంకర్ల వల్ల ఒరిజినల్ యాంకర్ల పరిస్థితి ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎటువంటి రూపాల్లో మన జీవితాల్లోకి తీసుకువస్తుంది? వీటికి సమాధానం లభించడం కష్టం. కానీ టెక్నాలజీని మాత్రం ఆపడం సాధ్యం కాదు. ఇదే సమయంలో డిజిటల్ యాంకర్లకు మరిన్ని సొబగులు అద్దే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. బిగ్ టివి తీసుకొచ్చిన మాయ ఒక గేమ్ చేంజర్ లాగా కనిపిస్తుంది గానీ.. దీనిని మిగతా చానల్స్ అందిపుచ్చుకునే ప్రయత్నాలు మాత్రం కనిపించడం లేదు.

సైడ్ తీసుకుంది

ఎక్కడో ఒక టీవీ చేసిన ప్రయోగాన్ని ఊదర గొట్టిన తెలుగు మీడియా.. బిగ్ టీవీ చేసిన ప్రయోగాన్ని మాత్రం స్వాగతించలేకపోయింది. రాజకీయాల్లో మాత్రమే కాదు, చివరికి ఇలాంటి విషయాలను కూడా తనకు అలవాటైన రీతిలోనే సైడ్ తీసుకుంది. అంటే ఇక్కడ బిగ్ టీవీ పెద్ద ఛానల్ కాదు. పైగా అది ఈ మధ్యే సాటిలైట్ లోకి వచ్చింది. ముందుగా మాత్రం అది సోషల్ మీడియానే నమ్ముకుంది. అది యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతోంది. బహుశా ఇందుకే కాబోలు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ దాన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ బిగ్ టీవీ తీసుకొచ్చిన మాయ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా అవుతున్నాయి. అఫ్కోర్స్ బిగ్ టీవీ యాజమాన్యం కోరుకునేది కూడా అదే. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కంటే ఇప్పుడు సోషల్ మీడియానే కదా బెటర్.