IPL Sunrisers Kavya : ఆమె పేరు కావ్య. వయసు 30 సంవత్సరాలు. తండ్రి సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్.. తల్లి కావేరి మారన్. ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది ఆమె బ్యాక్ గ్రౌండ్ ఎంత స్ట్రాంగో. కానీ అలాంటి అమ్మాయి క్రీడారంగంలోకి వచ్చింది.. “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో” అన్నట్టు ఐపిఎల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఇంట్లో గెలిస్తే ఏముంటుంది లక్కూ… బయట గెలిస్తేనే కదా అసలు కిక్కు అంటూ.. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లో ఉన్న హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసింది. దానికి తమ గ్రూప్ పేరు సన్ రైజర్స్ హైదరాబాద్ గా నామకరణం చేసింది.. అంతేకాదు ఐపీఎల్ వేలం మొదలైంది అంటే చాలు మీడియాలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే ఆమె చలాకితనం అటువంటిది.

ఎంతో హుషారు
ఐపీఎల్ వేలం మొదలైంది అంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది.. ఎంతో చలాకీగా ఉంటూ, జట్టు సభ్యులను ఎంపిక చేసుకోవడంలో మేనేజ్మెంట్ సలహాలు తీసుకుంటూ వేలం జరుగుతున్నంత సేపు కావ్య మారన్ హుషారుగా ఉంటుంది.. కొచ్చిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలోనూ ఆమె పాల్గొన్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను 13.25 కోట్లకు దక్కించుకున్నారు.. దేశీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను 8.25 కోట్లకు కొనుగోలు చేశారు.. తాజా ఐపీఎల్ మినీ వేలంతో ఆమె పేరు సామాజిక మాధ్యమాల్లో రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నది.
ఎంబీఏ చదివింది
కావ్య కు ఏవియేషన్, మీడియా రంగంలో ఆసక్తి ఎక్కువ.. ప్రస్తుతం సన్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి కళానిధి మారన్ 1990లో చిన్న మ్యాగజైన్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించారు.. అంచలంచెలుగా ఎదిగారు. తాజాగా రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇక కావ్యమారన్ కుటుంబానికి కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా రాజకీయంగా చాలా గట్టి పలుకుబడి ఉంది. కావ్య మారన్ తాత మురసోలిమారన్ డీఎంకే నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు.. ఆమె బాబాయ్ దయానిధి మారన్ ఎంపీగా పని చేశారు.. తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కావ్య తాతయ్య మురసోలి మారన్ కు స్వయానా మేనమామ. ఇక సన్ గ్రూపులో జెమిని తో పాటు అనేక భాషల్లో ఛానల్స్ ఉన్నాయి. సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఈ సంస్థకు చెందినదే.. సన్ గ్రూప్ కు రెడ్ ఎఫ్ఎం తో పాటు దేశవ్యాప్తంగా 70 రేడియో స్టేషన్లు ఉన్నాయి.. అయితే తాజా వేలంలో మయాంక్ అగర్వాల్ హైదరాబాద్ జట్టు పక్క వ్యూహంతోనే ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. గత సీజన్ లో కేవలం 13 మ్యాచులు మాత్రమే ఆడిన మయాంక్ 196 పరుగులు చేసినప్పటికీ… పంజాబ్ జట్టును ఆరో స్థానంలో నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.. అయితే ఈసారి మయాంక్ అగర్వాల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా నియమించాలని కావ్య మారన్ ఉత్సాహంగా ఉన్నారు.