ఢిల్లీ అల్లర్లు 1984, 1989, 2002 జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి. 1984 లో సిక్కు వ్యతిరేక దమనకాండ, 1989 లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులు, పర్యవసానంగా 4 లక్షలమంది సామూహిక వలస, 2002 లో జరిగిన గోధ్రా రైలు ఘటన, పర్యవసానంగా జరిగిన హిందూ-ముస్లిం ఘర్షణలు, స్వాతంత్య్రానంతరం ఈ మూడే అతిపెద్ద మాయని మచ్చలు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫరాబాద్ అల్లర్లు ఆ స్థాయిలో కాకపోయినా చరిత్రలో చీకటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వీటికి ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీ కూడా జతకలిసింది. ఇప్పటికే 23 మందిని ఈ అల్లర్లు బలిగొన్నాయి. ఢిల్లీ మన దేశరాజధాని . ఈ అల్లర్లతో ఢిల్లీ ప్రతిష్ట మసకబారింది. చరిత్రలో 1947, 1984 ల్లో ఢిల్లీ మత ఘర్షణల్లో అట్టుడికింది. తిరిగి ఇప్పుడు చరిత్ర పునరావృతమయ్యింది.
దీనికి పూర్వ నేపధ్యం పౌరసత్వ సవరణ చట్టం. గత రెండు నెలలనుంచి దీనిపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. షహీన్ బాగ్ లో రహదారి నిర్బంధం చేసి ఈ నిరసన కొనసాగుతుంది. మొదట్లో ఇది రాజకీయ ఆందోళనగానే వున్నా రాను రాను కేవలం ఓ మత వర్గానికి చెందిన ఆందోళనగానే పరివర్తన చెందింది. దానిలో మాట్లాడిన వక్తలు దేశ వ్యతిరేక నినాదాలు , దేశవ్యతిరేక ప్రసంగాలు చేయటం ప్రచారసాధనాల్లో చూసాం. దానితో మిగతా వర్గాల్లో కూడా ప్రతిస్పందనలు మొదలయ్యాయి. చివరకు సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సి వుంది. అంటే ఇంటలిజెన్స్, సర్వైలెన్స్ వ్యవస్థలు చాలా పకడ్బందీగా పనిచేయాల్సివుంది. ఈ విషయంలో వాటి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వ్యవస్థలు వున్నదే అందుకు.
ఇకపోతే దీనికి ఏదో ఒక వర్గాన్ని నిందించటం తగదు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతోందని మరిచిపోవద్దు. షహీన్ బాగ్ స్పూర్తితో ఈ ఆందోళనలను మిగతా ప్రాంతాలకు విస్తరించటానికి ప్రయత్నించటం ఢిల్లీ వాసులకు కోపం తెప్పించిన మాట వాస్తవం. అయితే ప్రభుత్వం లో వున్న వాళ్ళు సహనం వహించాల్సిన అవసరం వుంది. బీజేపీ లోని కొంత మంది నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలు అభ్యంతరకరం. వాళ్లపై బీజేపీ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకొని వుండాల్సింది. కనీసం బహిరంగంగా వాటిని ఖండించి వుండాల్సింది. అలా చేయక పోవటం బీజేపీ వైపునుంచి లోపం, తప్పుకూడా. అదేసమయంలో రెండోవైపు షహీన్ బాగ్ లో ఎప్పట్నుంచో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా కిమ్మనకుండా ఉండటం ప్రభుత్వ నిష్క్రియాపత్వానికి మచ్చుతునక. దానితో పాటు ఇటీవల మజ్లీస్ నాయకుడు గుల్బర్గాలో చేసిన ప్రసంగం దేశం మొత్తం చూడటం కూడా కొంత ఉద్రిక్తతలు కారణమయ్యింది. ఇలా రెండు వైపులా రెచ్చగొట్టే ధోరణలు జరిగాయన్నది వాస్తవం. అయితే ట్రంప్ వచ్చినప్పుడు ఇలా జరగటంతో మన ప్రతిష్ట అంతర్జాతీయ సమాజంలో దెబ్బతిన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవతీసుకుని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ని రంగంలోకి దించటం ఆహ్వానించదగ్గ పరిణామం. పరిస్థితులు వేగంగానే దారికి వస్తాయని ఆశిద్దాం.
ఇదంతా ఒకఎత్తయితే దీన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం పై అస్త్రాలు సంధించటం ప్రతిపక్షాలు చేయదగ్గపనికాదు. దానికి టైముంది. పరిస్థితులన్నీ చక్కబడ్డతర్వాత ప్రభుత్వలోపాల్ని ఎత్తిచూపటం చేయొచ్చు. ఇప్పుడు జరగాల్సింది శాంతిభద్రతల పునరుద్ధరణ. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, సాంఘిక సంస్థలు , మేధావులు, మీడియా అందరికీ ఇందులో బాధ్యత వుంది. అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తుకోవటం కొద్దిరోజులు ఆపేయాలి. ఆ ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల్లో విశ్వాసం పాదుకొల్పాలి. ఏదో ఒక వర్గం తరఫున మాట్లాడుతున్నట్లు వుండకూడదు. రెచ్చగొట్టుకోవటం తేలిక, కలపటం సమయం తీసుకుంటుంది. సోనియా గాంధీ అయినా , సీతారాం ఏచూరి అయినా , కేటీర్ అయినా ఇప్పుడుచేయాల్సింది ఇదే. ఆరోపణలకు ఇది సమయం కాదు. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. సామరస్యవాతావరణం పునరుద్ధరించటమొక్కటే మనముందున్న ఏకైక లక్ష్యం. దానికోసం అందరం కృషిచేద్దాం.