Site icon OkTelugu

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

CBI Probe into Kaleshwaram Project

CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు చేస్తోంది. రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లతోపాటు కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలులో విఫలమైందని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్‌చేసి ఎల్లంపల్లికి అక్కడి నుంచి కొండ పోచమ్మ, మల్లన్నసాగర్, మిడ్‌మానేరు, దిగువ మానేరుకు తరలించాలని బీఆర్‌ఎస్‌ కోరింది. ఈమేరకు మాజీ మంత్రులు హరీశ్‌రావు కన్నెపల్లి పంప్‌హౌస్‌ సందర్శనకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి.. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్‌ చేయడం సాధక్యం కాదని తేల్చారు. ఈమేరకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

సాగునీటిపై రాజకీయ రచ్చ..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలోని కన్నెపల్లి పంప్‌ హౌస్‌ ద్వారా నీటిని ఎత్తిపోయాలనే అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖరీఫ్‌ సీజన్‌లో నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలకు లేఖ రాసి అనుమతి కోరడం, గత వైఖరితో పోలిస్తే స్పష్టమైన మార్పును చూపుతోంది. ఈ పరిణామం రైతు అవసరాలు, డ్యామ్‌ భద్రత, రాజకీయ ఒత్తిడులు మధ్యన ఉన్న సంక్లిష్ట సమీకరణను తెరపైకి తీసుకొచ్చింది.

ప్రభుత్వం కేంద్రానికి లేఖ..
రాష్ట్ర ప్రభుత్వం జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)లకు లేఖ రాసి కన్నెపల్లి పంప్‌ హౌస్‌ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి కోరింది. ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు నీరు అవసరమని ఈ అభ్యర్థన వెనుక ఉన్న ముఖ్య కారణం. కేంద్ర స్పందన కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది.

మొన్న తిరస్కరణ.. నేడు అభ్యర్థన..
గతంలో మేడిగడ్డ బ్యారేజీ భద్రత దృష్ట్యా కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్‌ చేయలేమని ప్రభుత్వం స్పష్టంగా తిరస్కరించింది. వరదలు వచ్చినప్పుడు గేట్లు మూయకుండానే పంపింగ్‌ చేయవచ్చన్న సూచనలను కూడా సాధ్యం కాదని తోసిపుచ్చింది. వరదలు తగ్గిన తర్వాత ఇప్పుడు అనుమతి కోసం లేఖ రాయడం ఇప్పుడు ప్రభుత్వం తీరును తప్పు పట్టేలా చేస్తోంది. భద్రతా ఆందోళనలు ఒక్కసారిగా ఎలా తగ్గాయి? సాంకేతికంగా ఏమైనా మార్పులు వచ్చాయా? లేదా పరిస్థితుల ఒత్తిడితోనే ఈ మార్పు జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెండు నెలల పోరాటం..
నీటి లిఫ్టింగ్‌ కోసం విపక్షాలు, రైతు సంఘాలు దాదాపు రెండు నెలలుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో బీఆర్‌ఎస్‌ కూడా ఈ అంశంపై ఒత్తిడి పెంచింది. ప్రభుత్వం గతంలో భద్రతను ముందుంచి నిరాకరించినప్పుడు, ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడంతో విమర్శలు తీవ్రమయ్యాయి. ‘‘మొన్న కుదరదనిం నేడు లిఫ్ట్‌ చేస్తామని’’ అనే విమర్శలు ఈ మార్పును రాజకీయ అవకాశవాదంగా చిత్రీకరిస్తున్నాయి. రైతుల దృష్టిలో ఇది ఆలస్యమైన చర్యగా కనిపిస్తోంది.

భద్రతా సమస్యలపై నిలదీత..
మేడిగడ్డ బ్యారేజీ భద్రత కొన్నేళ్లుగా చర్చనీయాంశం. ప్రభుత్వం గతంలో ఆ భద్రతను ప్రధాన కారణంగా చూపించి లిఫ్టింగ్‌ను నిలిపివేసింది. ఇప్పుడు అదే స్థలం నుంచి నీటిని ఎత్తిపోయాలని కేంద్ర అనుమతి కోరడం వల్ల ‘‘భద్రత ఏమైంది?’’ అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.ఎన్‌ఈఎస్‌ఏ వంటి సంస్థలు సాంకేతిక పరిశీలన చేసి స్పందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రాష్ట్రం, కేంద్రం మధ్య సమన్వయం ఎంతవరకు సాగుతుందో కీలకం.

ఖరీఫ్‌ సీజన్‌కు అత్యవసరం..
తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌లో నీటి అవసరం ఎంతో కీలకం. కన్నెపల్లి ద్వారా నీరు అందితే కొన్ని ప్రాంతాల రైతులకు ఉపశమనం లభించవచ్చు. అయితే డ్యామ్‌ భద్రత, నిర్మాణ స్థిరత్వం, దీర్ఘకాలిక ప్రభావాలు వంటి అంశాలను విస్మరించలేం. ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర అనుమతి మార్గం ద్వారా ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం, గతంలో తానే చూపించిన ఆందోళనలను ఎలా అధిగమించబోతోందో స్పష్టం కావాలి. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే లిఫ్టింగ్‌ సాధ్యమవుతుంది. అయితే ఎన్‌డీఎస్‌ఏ సాంకేతిక నివేదికలు, భద్రతా నిబంధనలు ఎలా ఉంటాయో చూడాలి. రాజకీయంగా ఈ అంశం విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం గత వైఖరిని సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది.

Exit mobile version