
Friendship: వారి ముగ్గురిది ఒకే ఊరు. కలిసే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. దూరపు బంధువులు. దీంతో పాటు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఏం చేసినా కలిసే చేసేవారు. వారు ముగ్గురు ఎంత మంచి స్నేహితులంటే మరణం కూడా వారిని వేరు చేయాలనుకోలేదు. అందుకే వారి ముగ్గురిని ఒకే సారి తీసుకెళ్లింది. ఈ కన్నీళ్లు తెప్పించే ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
ఒకే ఇంటి పేరు.. దూరపు బంధువులు..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఉప్పరిపేటకు చెందిన ఎక్కలదేవి గంగజల(19), ఎక్కలదేవి వందన (16), ఎక్కలదేవి మల్లిక (19) మంచి స్నేహితులు. దూరపు బంధువులు కావడం, దాదాపు అందరి వయసులు దగ్గర దగ్గరగానే ఉండటంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎప్పుడూ కలిసే ఉండేవారు. వందన ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా, మిగితా వారిద్దరూ ఇంటర్ పూర్తి చేశారు. ఇందులో గంగజలకు నర్సింగాపురానికి చెందిన అత్తెన రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె వివాహం ఆగస్గు 23న జరిగింది. అలాగే కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన ఆదరవేణి రాజుతో మళ్లిక వివాహం జరిపారు. ఈ పెళ్లి అదే నెల 26వ తేదిన జరిగింది. ఈ వివాహల వల్ల ముగ్గురు స్నేహితురాళ్లు విడిపోయారు. ఇద్దరు తమ అత్తగారి ఊర్లో ఉంటుండగా, వందన మాత్రం ఉప్పరిపేటలోనే ఉంటోంది.
పుట్టింటికొచ్చి.. మృత్యుఒడికి చేరారు..
పెళ్లి అయిన మళ్లిక, గంగజలు ఇద్దరు అత్తగారి ఇంట్లో నుంచి వారం రోజుల క్రితమే పుట్టింటికి వచ్చారు. ఈ నెల 27వ తేదీన వేరు వేరుగా బయటకు వచ్చారు. సాయంత్రం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. స్థానిక ప్రాంతాలన్ని వెతికారు. ఎంత వెతికినా వారు కనిపించలేదు. ఏమైందేమో ఏమో గాని 28వ తేదీన ధర్మసముద్రం రిజార్వాయర్‌లో మృతదేహాలుగా తేలారు. వారు ఆనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని మళ్లిక, గంగజల కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వారితో కలిసి తమ కూతురు కూడా ఆత్మహత్య చేసుకుందని వందన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కలిసి ఉండలేకపోవడమే కారణమా ?
చిన్నప్పటి నుంచి కలిసి, పెరిగి ఎంతో ఆనందంగా గడిపిన ముగ్గురు స్నేహితురాళ్లు వివాహాల వల్ల విడిపోయారు. ఒక్కసారిగా వారు దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయినట్టు ఉన్నారు. అందుకే కలిసి ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిల అత్తగారి ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలు లేవని, వారంతా చాలా మంచి వారని మృతుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వారంతా కలిసి ఉండలేకపోతున్నామనే బాధతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని స్థానికులు తెలుపుతున్నారు.