Euphoria Musical Night : తలసేమియా( thalassemia ) వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్( music director Taman) నిర్వహించిన మ్యూజికల్ నైట్ సక్సెస్ అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత 28 సంవత్సరాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందిస్తోంది. దానికి నారా భువనేశ్వరి అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటికే తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలబడుతూ వచ్చింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించి.. దాని ద్వారా వచ్చే విరాళాలు తల సేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు వినియోగించాలని భువనేశ్వరి భావించారు. తమన్ కు సంప్రదించగా ఆయన మ్యూజికల్ నైట్ కు సమర్పించారు. యూఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట కార్యక్రమం కొనసాగింది. రాత్రి 11:30 గంటల వరకు వీనుల విందుగా సాగింది ఈ కార్యక్రమం.
* భారీగా తరలివచ్చిన జనం
మరోవైపు భారీగా జనాలు తరలివచ్చారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు( CM Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ భువనేశ్వరి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మన నుంచి సమాజం ఎంతో కొంత కోరుకుంటున్నారని.. అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మనం సంపాదించే ఆదాయంలో కొంత మొత్తం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని పిలుపునిచ్చారు. కష్టం ఎక్కడుంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవారని గుర్తు చేశారు. విపత్తుల సమయంలో బాధితుల కోసం జోలె పట్టారని కూడా చెప్పుకొచ్చారు. ఆయన పేరిట ట్రస్టు కొనసాగడం గర్వకారణం అన్నారు.
* బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అలా ఎన్టీఆర్( Nandamuri Taraka Rama Rao ) సతీమణి బసవతారకం క్యాన్సర్ తో చనిపోయిన సంగతి తెలిసిందే. అందుకే బసవతారకం పేరుతో ఏకంగా క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించిన ఘనత నందమూరి వంశానికి దక్కుతుందని కొనియాడారు చంద్రబాబు. తండ్రి పేరుతో భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుండడం శుభపరిణామం అన్నారు. నాంది అని స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు జాతీయస్థాయిలో సైతం గుర్తింపు పొందిందని చెప్పుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు 28 సంవత్సరాలుగా కొనసాగుతుండడం గొప్ప విషయం అన్నారు. ఎన్టీఆర్ వంటి మహానీయుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ఎన్టీఆర్ ట్రస్టు తో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ తీరు అభినందనీయం అన్నారు.
* యువత కేరింత
ఈ మ్యూజికల్ నైట్ విజయవాడ( Vijayawada) యువతను ఉర్రూతలూగించింది. తమన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ పాటలతో పాటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చిత్రాల్లో ముఖ్యమైన పాటలను వినిపించారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా పాట పాడి అలరించారు. వకీల్ సాబ్ లో వచ్చిన మగువా మగువా అనే పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమ్లా నాయక్ పాటతో యువత స్టెప్పులు వేయడం కనిపించింది. మొత్తానికి అయితే యుఫోరియా పేరిట నిర్వహించిన ఈ మ్యూజికల్ నైట్ విజయవంతం అయ్యింది.