Lakshmi Parvathi: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణం చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. ఆమె అంత్యక్రియలు ముగిసినా కూడా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం బయటపడడం లేదు. పైకి అనారోగ్య కారణాలు అంటున్న వాటిని ఎవరూ నమ్మడం లేదు. ఈ ఆరోపణలకు మరింత బలాన్ని ఇచ్చేలా తాజాగా ఎన్టీఆర్ భార్య అయిన వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి బాంబు పేల్చారు. ఆమెచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబే కారణమనే అనుమానం ఉందని.. కాబట్టి సీబీఐ దర్యాప్తును కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. లేకపోతే తానే స్వయంగా లేఖ రాస్తాను అని లక్ష్మీపార్వతి సంచలన ప్రకటన చేశారు. ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు.. విద్యావంతురాలు అని.. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఇరికించేలా లక్ష్మీపార్వతి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఎన్టీఆర్ కుటుంబంలో ఆస్తి కోసం.. చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారట.. ఆ ఒత్తిడి భరించలేకనే ఉమామహేశ్వరి ఆత్మహత్య అన్న ప్రచారం సాగుతోందని లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె సూసైడ్ నోట్ మాయం కావడం మరిన్ని అపోహలకు.. అనుమానాలకు దారితీసిందని అన్నారు.
ఎన్టీఆర్ కుటుంబంలోకి ఓ శనిలా ప్రేవేశించిన చంద్రబాబు ఒక విష వలయం అని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి కారణమై ఆయన పేరునే వాడుకుంటున్నారని స్వార్థ రాజకీయాల కోసం హరికృష్ణను బలిచేశారని లక్ష్మీపార్వతి విమర్శించారు.
లక్షలకోట్లు సంపాదించిన చంద్రబాబు ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబాన్ని విడిచిపెట్టాలని.. బాలకృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.
మొత్తంగా ఇప్పటివరకూ గుట్టుగా సాగిన ‘ఉమా మహేశ్వరి ఆత్మహత్య వ్యవహారంలోకి లక్ష్కీపార్వతి ఎంట్రీతో మలుపు తిరిగింది. ఆమె వైసీపీలో ఉండడం.. పైగా ఎన్టీఆర్ కు రెండో భార్యగా కూడా ఉండడంతో లక్ష్మీపార్వతి ఆరోపణలు సంచలనమయ్యాయి. మరి ఈ ఆరోపణలపై చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.