Bikkavolu Temple: మనలో చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయి. భక్తులలో ఎక్కువమంది దేవుడిని కోరికలు కోరుకుని ఆ కోరికలను తీర్చాలని అడుగుతూ ఉంటారు. అయితే మనస్సులోని కోరికలను ఆ దేవాలయంలోని వినాయకుని చెవిలో చెబితే తీరతాయని భక్తులు నమ్ముతారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలలో తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలులో ఉన్న శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం కూడా ఒకటి.
ఇక్కడ కొలువై ఉండే వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రీస్తు శకం 840లో ఈ ఆలయంను నిర్మించారని సమాచారం. ఈ ఆలయంలో ఉండే స్తంభాలపై చాణుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉంటాయి. ఈ ఆలయంలో కోరికలను కోరుకుని ముడుపు కడితే కోరికలు ఖచ్చితంగా తీరతాయని భక్తులు చెబుతారు. ఈ ఆలయంలో నందీశ్వరుడిని, భూ లింగేశ్వరుడిని దర్శించుకోవడం ద్వారా పాపాలు అన్నీ తొలగిపోతాయి.
ఈ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత దివ్యమైన అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. ఈ ఆలయంలో వినాయకుని తొండం ఇతర ఆలయాలకు భిన్నంగా దక్షిణావృతంగా ఉంటుంది. ఈ దేవునికి వెలగపండ్లు పెట్టి వేడుకుంటే కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఉండ్రాళ్లు పెట్టి నమస్కరించడం ద్వారా గండాలను కూడా తొలగించుకోవచ్చు. గడ్డిపరకలు వేసి గణేశాయనమః అని కోరితే గంపెడు శుభాలు కలిగే అవకాశం ఉంటుంది.
ఈ ఆలయానికి ఒకవైపు కుమారస్వామి ఆలయం, మరోవైపు గోలింగేశ్వరస్వామి ఆలయం ఉంటాయి. ఈ క్షేత్రం కాకినాడ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉండగా రాజమండ్రి నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట రైల్వే జంక్షన్ ఉండగా 35 కిలోమీటర్ల దూరంలో మధురపూడి విమానశ్రయం ఉన్నాయి.