Samantha: సమంత – అక్కినేని నాగచైతన్య వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత… ఇటీవల అనూహ్యంగా తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. సామ్ – చైతూ విడిపోవడానికి సమంతనే కారణం అంటూ ఆమె పై కధనాలు కూడా వచ్చాయి. అయితే ఇందుకు గాను తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కధనాలు ప్రచురించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్ పల్లి కోర్టులో… సమంత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా నటి సమంతకు కూకట్ పల్లి కోర్ట్ లో ఊరట లభించింది. తనపై వ్యక్తిగతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దాఖలు చేసింది. సమంత ఫిర్యాదుపై ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. సమంతపై పెట్టిన కంటెంట్ ను తొలగించాలని కూకట్ పల్లి కోర్టు సదరు యూట్యూబ్ ఛానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ ప్రసారాాలు చేసిన యూట్యూబ్ లింకులను కూడా తొలగించాలని ఆదేశించారు.
ఆమె ప్రతిష్టకు భంగం కలిగించరాదని… ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయొద్దని తీర్పు ఇచ్చింది. ఇక మీదట ఎటువంటి అనుచిత వీడియోలు, వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఇదే విధంగా సమంత కూడా తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెట్టవద్దని కూకట్ పల్లి కోర్ట్ సూచించింది. ఇటీవల నాగచైతన్యతో సమంత విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది.