Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అల్లకల్లోలం అవుతోంది. ఓవైపు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డిని తిట్టిపోయగానే.. దీన్నంతా నడిపించేది ఆయన అన్న వెంకటరెడ్డి అని రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ అనుమానాలకు బలం ఇచ్చేలా తాజాగా ఢిల్లీలో పరిణామం చోటుచేసుకుంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు వేర్వేరుగా కొంచెం గ్యాప్ తో అమిత్ షాతో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత రాజగోపాల్ రెడ్డి అమిత్ షాతో భేటి అయ్యారు. బీజేపీలో చేరిక తేదీపై చర్చించారు. అనంతరం వెంకటరెడ్డి అమిత్ షాను కలవడం సంచలనమైంది.
తమ్ముడు ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు వెళ్లగా.. అన్న వెంకటరెడ్డి కూడా అమిత్ షాను కలవడం సంచలనమైంది. పైకి తెలంగాణకు వరద సాయం గురించి అడిగానని చెప్పినా.. వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరికపై అమిత్ షాతో మంతనాలు జరిపాడని అర్థమవుతోందని పలువురు అంటున్నారు.
రేవంత్ రెడ్డి ఇటీవల కోమటి రెడ్డి బ్రదర్స్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. దానికి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వడం.. ఇక తాజాగా వెంకటరెడ్డికి బద్ద వ్యతిరేకి అయిన చెరుకు సుధాకర్ ను రేవంత్ రెడ్డి పార్టీలోకి చేర్చుకోవడంతో ఈ పరిణామం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ అనుకూల రాజకీయానికి చెక్ పెట్టేందుకే ‘తెలంగాణ ఇంటిపార్టీ’ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను రేవంత్ రెడ్డి చేర్చుకున్నాడని టాక్. ఇదే విషయాన్ని వెంకటరెడ్డి కూడా లేవనెత్తాడు.
ఇక రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం ఇవన్నీ చేస్తుండగా.. లోపాయికారీ రాజకీయాలతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లోనే ఉండి ఆ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నాడు. కోమటిరెడ్డి రాజకీయం తెలిసే రేవంత్ రెడ్డి వారికి కర్రుకాల్చి వాతపెట్టేలా చేస్తున్నాడు.
కోమటిరెడ్డి బ్రదర్స్ లొల్లి చాలదన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ లో మరో రాజీనామా కలకలం రేపింది. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి తీరును కడిగిపారేశాడు. రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరిని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. 120 ఏళ్ల పార్టీలోంచి సీనియర్లను పక్కనపెట్టి తన గ్రూపును బలోపేతం చేస్తున్నాడని.. ఏకస్వామ్యంగా అందరినీ బయటకు వెళ్లిపోయేలా చేస్తూ పార్టీలో తన గ్రూపును ఏర్పాటు చేసుకొని పెద్దపీట వేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇస్తూ వారిని తన బుట్టలో వేసుకున్నాడని మండిపడ్డారు.
ఇలా రేవంత్ రెడ్డి పార్టీని పట్టాలెక్కించే విషయంలో సీనియర్లను కలుపుకొని పోకుండా దూకుడుగా వెళ్లడంతో పలువురు హర్ట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ వెళ్లిపోతుండగా.. తాజాగా శ్రవణ్ బయటకొచ్చి అన్నింటికి కారణం రేవంత్ రెడ్డినేని అన్నారు. దీంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? తప్పంతా రేవంత్ రెడ్డిదేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసే సమయంలో ఇలాంటివి సహజమేనని.. అసమ్మతులను రేవంత్ రెడ్డి ఏరివేస్తూ ముందుకెళుతున్నాడని ఆయన వర్గం చెబుతోంది. ఈ గందరగోళం మధ్యన పార్టీ అల్లకల్లోలంగా మారుతోంది.