Kodali Nani : రజనీకాంత్ సరే.. వంగవీటి రాధాక్రిష్ణను ఏమీ అనలేని కొడాలి నాని

స్నేహం మాటున నాని ఆడుతున్న గేమ్ ఇప్పుడు పెద్దగా వర్కవుట్ కాలేదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను విమర్శించినట్టు వంగవీటి రాధాక్రిష్ణను విమర్శిస్తే పరిస్థితి ఏంటో నానికి తెలుసు. అందుకే విగ్రహావిష్కరణ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అయితే కాపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానికి జల్ల కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

  • Written By: Dharma Raj
  • Published On:
Kodali Nani : రజనీకాంత్ సరే.. వంగవీటి రాధాక్రిష్ణను ఏమీ అనలేని కొడాలి నాని

Kodali Nani : వైసీపీలోని ఫైర్ బ్రాండ్లలో తొలి వరుసలో ఉండేది కొడాలి నాని. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను ఉతికి ఆరేయ్యడంలో నానిది ప్రత్యేక బాణి.  మధ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్ పై సైతం ఓ రేంజ్ లో విరుచుకుపడతారు. వాస్తవానికి టీడీపీని, చంద్రబాబును అభినందించే ఏ ఒక్కర్నీ వదలరు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను సైతం విడిచిపెట్టలేదు. చంద్రబాబును అభినందించారన్న పాపానికి ఆయన శరీర ఆకృతులపై మాటాడేందుకు కూడా వెనుకాడలేదు. కానీ చంద్రబాబును అభినందించినా, లోకేష్ ను కలిసినా ఒక్కరి విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నారు. ఆయన్ను టచ్ చేస్తే మూల్యం చెల్లించుకుంటానని తెలిసే..ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

కొడాలి నాని టీడీపీలో ఎంట్రీ అనూహ్యం. కమ్మ కుల కార్డుతో నందమూరి హరికృష్ణకు దగ్గరయ్యారు. తెలుగు యువత నాయకుడిగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్ సిఫారసుతో గుడివాడ టీడీపీ టిక్కెట్ దక్కించుకున్నారు. అప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కాదని 2004లో నానికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. 2009లో సైతం టిక్కెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ పంచన చేరి 2014, 19 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గుడివాడలో బలమైన పునాది వేసుకున్నారు. నియోజకవర్గంలో కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ కులాల వారు ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 40 వేల వరకూ ఉన్నారు. వారి ఓట్లతోనే ఇన్నాళ్లు ఆయన రాజకీయం ఆడుతూ వస్తున్నారు.

అయితే ఈసారి ఎన్నికల్లో కాపులు ఎదురుతిరిగే అవకాశం ఉంది.  ప్రతిపక్ష నేతలు చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లపై తీవ్ర ఘాటైన విమర్శలు చేస్తున్న కొడాలి నానిని ఓడించడానికి అటు టీడీపీతోపాటు ఇటు జనసేన పార్టీ కూడా కంకణం కట్టుకుని ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై కొడాలి నాని చేస్తున్న విమర్శలను కాపు సామాజికవర్గం తట్టుకోలేకపోతోందని టాక్ నడుస్తోంది. అందులోనూ కొడాలి నాని కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. దీంతో సహజంగానే కాపులు కొడాలి నానిపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు నాని అనుచరులు పవన్ పై విమర్శలు వద్దని సూచించినట్టు తెలుస్తోంది. నాని పెడచెవిన పెట్టడంతో ఒకరిద్దరు యాక్టివ్ నాయకులు జనసేనలోకి వెళ్లిపోయారు.

అయితే తనను వంగవీటి మోహన్ రంగా గెలిపిస్తాడన్న బలమైన నమ్మకం నానిలో ఉంది. కాపు ఓటర్లను ఆకర్షించేందుకు గుడివాడ నియోజకవర్గం వ్యాప్తంగా రంగా విగ్రహాలను ఏర్పాటుచేయిస్తున్నారు. వాటిని గ్రాండ్ గా ఓపెన్ చేయిస్తున్నారు. తరచూ రంగా కుమారుడు రాధాక్రిష్ణను తెచ్చి ఓపెన్ చేయిస్తున్నారు. అయితే అదే రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. తరచూ నారా లోకేష్ ను కలుస్తుంటారు. టీడీపీలో సైతం యాక్టివ్ అయ్యారు. దీంతో కొడాలి నాని పప్పులుడకడం లేదు. స్నేహం మాటున నాని ఆడుతున్న గేమ్ ఇప్పుడు పెద్దగా వర్కవుట్ కాలేదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను విమర్శించినట్టు వంగవీటి రాధాక్రిష్ణను విమర్శిస్తే పరిస్థితి ఏంటో నానికి తెలుసు. అందుకే విగ్రహావిష్కరణ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అయితే కాపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానికి జల్ల కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు