Khakee The Bihar Chapter Review: వెబ్ సిరీస్: ఖాకి దీ బిహార్ చాప్టర్. నటీనటులు: కరణ్ టక్కర్, అవినాష్ తివారి, అభిమన్యు సింగ్, నీరజ్ కశ్యప్, జతిన్ శరణ్, రవి కిషన్, అశుతోష్ రాణా, తదితరులు, సంగీతం: అద్వైత్ నిమేల్కర్, సినిమాటోగ్రఫీ: హరినాయర్, ఎడిటింగ్: ప్రవీణ్ కతి కులోత్, నిర్మాత: శీతల్ భాటియా, రచన: నీరజ్ పాండే, దర్శకత్వం: భవ్ దులియా, స్ట్రీమింగ్: నెట్ ఫ్లిక్స్.

Khakee The Bihar Chapter Review
సాయికుమార్ పోలీస్ స్టోరీ నుంచి విశ్వక్సేన్ హిట్ సినిమా దాకా పోలీస్ కథలు కొన్ని మినహా అన్ని వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇందుకు కారణం లేకపోలేదు. సమాజంలో పేరుకుపోయిన అక్రమాలను, మనం చేయలేని పనులు పోలీసులు చేస్తుంటే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. ఇక సమాజంలో వాస్తవిక ఘటనల ఆధారంగా ఎన్నో పోలీస్ సినిమాలు వెండితెరపై మెరిశాయి. ఫ్యామిలీ మెన్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ లు కూడా దుమ్మురేపాయి. తాజాగా పోలీసు కథా నేపథ్యంలో ఖాకీ దీ బీహార్ చాప్టర్ పేరుతో నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతున్నది. ఇంతకీ అది ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ విషయానికి వస్తే
చందన్ మాతో( అవినాష్ తివారీ) కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్. ఒక సాధారణ గ్రామస్తుడిగా జీవితం మొదలు పెడతాడు. భూ కబ్జాలు, అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా… ఒక్కటేమిటి అతడు చేయని నేరమంటూ లేదు. బీహార్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదుగుతాడు. పోలీసులు కూడా అతడిని ఎప్పుడు పట్టుకుందామా? ఎ ప్పుడు ఎన్కౌంటర్ చేద్దామా? అని చూస్తూ ఉంటారు. బయట సమాజం మాదిరే అతడు కూడా కొందరు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. తనకు వ్యతిరేకంగా పనిచేసేవారిని దారుణంగా హత మార్చుతూ ఉంటాడు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న అమిత్ లోథా ( కరణ్ థాకర్) అనే యువ ఐపీఎస్ అధికారి బీహార్ వస్తాడు. తన శక్తి సామర్థ్యాలతో అక్కడ సమస్యలను పరిష్కరిస్తాడు. ఈక్రమంలో చందన్ మాతో ను పట్టుకునే బాధ్యత ప్రభుత్వం అమిత్ కు అప్పగిస్తుంది. ఆ బాధ్యత అమిత్ నిర్వర్తించాడా? ఇందులో ఎవరు గెలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెబ్ సిరీస్ మొత్తం చూడాలి.
ఎలా ఉంది అంటే..
బీహార్ రాష్ట్రం అంటే ఇప్పటికి కూడా మనకు రౌడీలే గుర్తుకొస్తారు. గుండాలు, గ్యాంగ్ స్టర్ లకు ఆ ప్రాంతం అడ్డా. అయితే వారి ఆగడాలను కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికి కూడా అక్కడ గ్యాంగ్స్టర్స్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే అలాంటి ఒక గ్యాంగ్స్టర్ కు, ఒక యువ ఐపీఎస్ అధికారికి జరిగిన పోరే ఖాకీ.. 2000 నుంచి 2010 దాకా బీహార్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. చందన్ మాతో ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించే సన్నివేశంతో సిరీస్ మొదలవుతుంది. ఉన్నతాధికారుల స్వార్థం, రాజకీయ నాయకుల పదవీకాంక్ష వల్ల చివరి నిమిషంలో ఆపరేషన్స్ ఎలా ఆగిపోతాయో ఉత్కంఠ గా చూపించారు. అమిత్ బీహార్ వెళ్లడం, అక్కడ ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వెళ్లడం, అతడి పరిచయంతో మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. చందన్ గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు? ఎలాంటి క్రూరమైన నేరాలు చేశాడు అనేది రెండో ఎపిసోడ్లో చూపించారు.

Khakee The Bihar Chapter Review
నాయకుడికి ప్రతి నాయకుడికి మధ్య వచ్చే సన్నివేశాలు ఎస్టాబ్లిష్ చేసేందుకు దర్శకుడు నిడివి ఎక్కువ తీసుకున్నాడు.. సమయంలో బిహార్ రాష్ట్రంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించాడు. అవి ఇప్పటి నవీన పరిస్థితులకు అద్దం పడతాయి.
ముఖ్యంగా పోలీస్ ఇన్ ఫార్మర్ల పేరుతో చాలామందిని చందన్ హత్య చేస్తాడు. అతడి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అతనిని పట్టుకునే బాధ్యత అమిత్ కు అప్పగిస్తుంది. అప్పటినుంచి పోలీస్ వర్సెస్ గ్యాంగ్ స్టర్ మాదిరి సన్నివేశాలు వెళ్తుంటాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్టే కనిపిస్తాయి. అమిత్ సాగించే దర్యాప్తు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద విషయం కాకపోయినా… 2005లోనే చందన్ ను పట్టుకునేందుకు అమిత్ ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని వాడుకోవడం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. పోలీసులకు దిలీప్ సాహు (జతిన్ శరణ్) మధ్య సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తాయి.. కథ, కథా నేపథ్యం వేరుగా ఉన్నప్పటికీ.. అక్కడక్కడ కార్తీ ఖాకీని గుర్తుచేస్తుంది. మొదటి నాలుగు ఎపిసోడ్లు కథను, పాత్రలను ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించిన దర్శకుడు.. తర్వాత అనుకోని మలుపులతో రక్తి కట్టించాడు. చివరిలో చేజింగ్ సీన్, పోరాట సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. పోలీస్ సినిమాలు అంటే ఇష్టపడే వారికి ఖాకీ ది బీహార్ చాప్టర్ మంచి ఛాయిస్. అయితే నిడివి కాస్త ఎక్కువ ఉంటుంది.
ఎవరు ఎలా చేశారంటే..
ఈ సిరీస్ లో పాత్రలకు అందరూ చక్కగా సరిపోయారు. ఐపీఎస్ అధికారిగా కరణ్ బాగా నటించారు. ఆరున్నర గంటల పాటు ఉండే ఈ వెబ్ సిరీస్ లో అతడి స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ. అయితే అందుకు తగ్గట్టుగా పాత్రను తీర్చి దిద్దిన విధానం బాగుంది. వ్యవస్థల పనితీరు బాగోలేనప్పటికీ, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే పోలీస్ అధికారిగా ఆయన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుంది. చందన్ మాతో పాత్రను ఇంకా తీర్చి దిద్దితే బాగుండేది. సాంకేతంగా ఈ వెబ్ సిరీస్ ఓకే. 2005 నాటి పరిస్థితులు చూపించేందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడింది. చాలా సన్నివేశాలకు కత్తెర వేయాలిసిన అవసరం ఉంది. కానీ వాస్తవికత అలాగే వదిలేశారు. నీరజ్ పాండే స్క్రిప్ట్ గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. పాత్రల పరిచయం కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. నాలుగు ఎపిసోడ్లు గడిస్తే గాని అసలు పాయింట్ అర్థం కాదు.
బలాలు
కథ+ కథా నేపథ్యం+ కొన్ని ట్విస్ట్ లు
బలహీనతలు
విసిగించే నిడివి, కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్టు అనిపించడం, రొటీన్ గా సాగిన క్లైమాక్స్.
బాటమ్ లైన్: గ్యాంగ్స్టర్ వర్సెస్ ఐపీఎస్ పోలీస్