CM Jagan: జగన్ దుకాణం ఎత్తేస్తాడా? ఏపీలో కీలక పరిణామాలు
చంద్రబాబు అరెస్ట్, తర్వాత జరిగిన పరిణామాలపై మంత్రులతో సీఎం జగన్ సమీక్షించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల నుంచి విపరీతమైన సానుభూతి వచ్చిందని టిడిపి భావిస్తోంది.

CM Jagan: ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరుకానున్నట్లు టిడిపి స్పష్టం చేసింది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి పలు నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు మంత్రివర్గ భేటీ జరగనుంది.
చంద్రబాబు అరెస్ట్, తర్వాత జరిగిన పరిణామాలపై మంత్రులతో సీఎం జగన్ సమీక్షించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల నుంచి విపరీతమైన సానుభూతి వచ్చిందని టిడిపి భావిస్తోంది. అయితే గతంలో జగన్ సైతం జైలుకు వెళ్లి వచ్చారని.. కానీ తర్వాతే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన విషయాన్ని వైసిపి గుర్తు చేస్తుంది. మరోవైపు టిడిపి,జనసేన మధ్య పొత్తు కుదరడంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుతో వైసిపి లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేయడం వల్ల దాదాపు 50 నియోజకవర్గాల్లో వైసిపి గెలుపు సాధ్యమైంది. అటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అటువంటి చోట్ల అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. సిపిఎస్ రద్దు విషయంలో ఇచ్చిన హామీపై ఆ రెండు వర్గాల్లో ఆగ్రహం ఉంది. ప్రభుత్వం జిపిఎస్ ను ప్రకటించినా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పరిశ్రమల ఏర్పాటు, భూ కేటాయింపులు వంటిపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును సీఎం జగన్ స్వాగతించారు. పార్లమెంట్లో ఆమోదము లభిస్తే రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ బిల్లు పైన చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని కీలక బిల్లులను కేంద్రం ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటి పైన శాసనసభ సమావేశాల్లో చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చంద్రబాబు అరెస్టుపై అధికార పార్టీని నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
