YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో డొంక కదిలిందా? ప్రస్తుతానికి ‘తీగ’ను పట్టుకొని లాగే పనిలో సీబీఐ అధికారులు ఉన్నారా? డైరెక్ట్ తాడేపల్లితో కనెక్షన్ ఉన్నట్టు గుర్తించారా? కీలక కాల్ డేటా లభ్యమైందా? హత్య జరిగిన రోజున ‘ముఖ్య కీలక నేత’తో పాటు ఆయన సతీమణికి భారీగా ఫోన్ కాల్స్ వెళ్లాయా? అవి డైరెక్ట్ గా కాకుండా ఇద్దరు వ్యక్తులు అనుసంధాన కర్తలుగా వ్యవహరించారా? ఎంపీ అవినాష్ రెడ్డి ఆ ఇద్దరు పేర్లు చెప్పారా? అంటులో భాగంగానే నవీన్ అనే వ్యక్తితో పాటు కీలక నేత సన్నిహితుడికి సీబీఐ నోటీసులిచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ కేసులో సీబీఐ పట్టుబిగించినట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండడం అనుమానితులతో పాటు అధికార పార్టీలో కలవరం రేపుతోంది.

YS Viveka Murder Case
ఈ నెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 4 గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం రాబెట్టే ప్రయత్నం చేశారు. కానీ అవినాష్ రెడ్డి ముక్తసరిగా మాట్లాడారు. కానీ వివేక హత్య జరిగిన రోజు కాల్ డేటా మొత్తం సీబీఐ అధికారులు అతడి ముందు ఉంచారు. అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రెండు నంబర్లకు ఎక్కువసార్లు కాల్స్ వెళ్లడాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో మాత్రం అవినాష్ రెడ్డి తప్పించుకోలేకపోయారు. ఆ రెండు నంబర్లు ఎవరివని పదేపదే ప్రశ్నించేసరికి సమాధానం చెప్పేశారు. తన వదిన భారతితో మాట్లాడేందుకే ఆ ఫోన్ నంబర్ కు కాల్ చేస్తుంటానని చెప్పారు. ఆ ఫోన్ నంబరు ఎవరిదని గట్టిగా అడిగేసరికి ‘నవీన్ ’ అన్న పేరును బయటపెట్టారు. నవీన్ ఎక్కడ ఉంటారని అడిగేసరికి విజయవాడ అని సమాధానం చెప్పారు. ఇక మరో నంబరు ఎవరిదని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపెట్టేశారు. సీఎం జగన్ తో మాట్లాడేందుకు ఆ ఫోన్ కు కాల్ చేస్తుంటానని బదులిచ్చారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులకు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో పవర్ ఫుల్ వ్యక్తి సహాయకుడే నవీన్. పవర్ ఫుల్ వ్యక్తికి ఎవరైనా సంప్రదించాలన్నా.. ఫోన్ లో మాట్లాడాలన్న నవీన్ కు ఫోన్ చేయాల్సిందే. ఆయన పవర్ ఫుల్ నేతకు ఫోన్ కలుపుతారు. మాట్లాడే ఏర్పాటుచేస్తారు. అయితే వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఎక్కువగా నవీన్ ఫోన్ నంబర్ కే కాల్ చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలని సీబీఐ నవీన్ కు నోటీసులిచ్చింది. అత్యంత ముఖ్యమైన నేత సన్నిహితుడికి సైతం సీబీఐ నోటీసులిచ్చింది. మరోవైపు పులివెందులలోని సీఎం జగన్ ఓఎస్డీ కార్యాలయానికి సీబీఐ అధికారులు వెళ్లారు. కార్యాలయ అధికారుల గురించి ఆరాతీశారు. హరిప్రసాద్ తో పాటు మరికొందరి పేర్లు ప్రస్తావిస్తూ.. వారందరూ ఎక్కడుంటారని ప్రశ్నించారు. పులివెందులలో కీలక ప్రదేశాలను పరిశీలించి విచారణ జరిపారు.

YS Viveka Murder Case
సీబీఐ అధికారుల కదలికలతో చాలా మంది నేతలు పులివెందుల విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు మోపబడిన వారితో పాటు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 10 నాటికి విచారణను ఒక కొలిక్కి తేవడానికి సీబీఐ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేసులో నిందితుడిగా ఉంటూ బెయిల్ పై బయటకు వచ్చిన గంగిరెడ్డి, అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి, రిమాండ్ ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లను ఫిబ్రవరి 10న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. సీబీఐ దూకుడు చూస్తుంటే మున్ముందు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరుగా తాడేపల్లి కి కేసులో లింకులుండడం ఆందోళన కలిగిస్తోంది.