MP Keshineni : టీడీపీలో ఎంపీ కేశినేని కలకలం

తాను, తన కుటుంబం జీవితాంతం రాజ‌కీయాల్లో వుండాల‌ని భావించే వ్య‌క్తిని కాద‌ని స్ప‌ష్టం చేశారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానన్నారు.  బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం అవసరమైతే ముళ్ళ పందితో అయినా కలుస్తానని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  • Written By: Dharma Raj
  • Published On:
MP Keshineni : టీడీపీలో ఎంపీ కేశినేని కలకలం

MP Keshineni : విజయవాడ ఎంపీ కేశినేని నాని అమీతుమీకి సిద్ధమయ్యారా? అవసరమైతే పార్టీ నుంచి తప్పుకోవడానికి రెడీ అంటున్నారా? తనకు ప్రత్యామ్నాయంగా సోదరుడు చిన్నిని తెరపైకి తేవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఇక లాభం లేదని భావిస్తున్నారా? అందుకే అనుచిత వ్యాఖ్యాలను తిరిగి మొదలుపెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసలతో ముంచెత్తిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని నిరుపేద యువకుడికి ఆటోను అందించారు. దీంతో పొలిటికల్ సర్కిల్ లో కేశినేని నానిపై కొత్త టాక్ ప్రారంభమైంది.

కేశినేని నానిది భిన్నమైన శైలి. గత రెండు ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఎంపీగా నెట్టుకొచ్చారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన స్వరం మారింది. ఆహార్యం మారిపోయింది. ఒక్కోసారి అధినేత చంద్రబాబును సైతం లెక్కచేయని విధంగా పరిస్థితి మారింది. గత కొద్దిరోజులుగా విజయవాడ రాజకీయాల్లో సోదరుడు చిన్ని ఎంట్రీని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దీని వెనుక చంద్రబాబు స్కెచ్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఒకానొక దశలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ టీడీపీలోనే కొనసాగారు. ఇటీవల అన్నీ సర్దుకుంటున్నాయన్న తరుణంలో తిరిగి అనుచిత వ్యాఖ్యలు ప్రారంభించారు.

ఇటీవల వైసీపీ ప్రజాప్రతినిధులను కేశినేని నాని పొగడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జ‌గన్మోహ‌న్‌రావుపై ఎంపీ కేశినేని, ఎంపీపై మొండితోక ప‌ర‌స్ప‌రం ప్ర‌శంస‌లు కురిపించుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.రోజుల వ్యవధిలోనే ఈ రోజు కేశినేని నాని సీరియస్ కామెంట్స్ చేశారు.  కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో నానికి పొసగడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్ధా వెంక‌న్న త‌దిత‌రుల‌తో కేశినేని నానికి చాలా కాలంగా విభేదాలున్నాయి. అందుకే ఆయ‌నకు ఎంపీ టిక్కెట్ తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు ప్రతిగా ఆయన కుమార్తెకు అసెంబ్లీ స్థానం కేటాయిస్తారని టాక్ నడుస్తోంది.

అయితే ఎంపీ సీటు నుంచి తనను తప్పించి తమ్ముడు చిన్నికి అప్పగిస్తారన్న ప్రచారంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అదే జరిగితే తన ప్రతాపం చూపిస్తానని సైతం హెచ్చరిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తారక్ అభిమానులు సమకూర్చిన  సీఎన్‌జీ ఆటోను పేద కార్మికుడికి ఎంపీ చేతుల మీదుగా అంద‌జేయడం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ ఇవ్వ‌క‌పోతే కేశినేని భ‌వ‌న్‌లో కూర్చొని బెజ‌వాడ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.తాను, తన కుటుంబం జీవితాంతం రాజ‌కీయాల్లో వుండాల‌ని భావించే వ్య‌క్తిని కాద‌ని స్ప‌ష్టం చేశారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానన్నారు.  బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం అవసరమైతే ముళ్ళ పందితో అయినా కలుస్తానని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు