KCR Meeting With Collectors: కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం.. కీలక నిర్ణయాలివీ!
అత్యున్నతస్థాయి సమావేశంలో చర్చించే అంశాల్లో ప్రధానంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ ప్రధాన అంశాలని తెలుస్తోంది.

KCR Meeting With Collectors: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం కేసీఆర్ హామీల అమలుకు చర్యలు వేగవంతం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ మాసం అధికార బీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకం కాబోతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జూన్‌లో చేపట్టే వివిధ కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది.
ఎజెండా అంశాలు ఇవే..
అత్యున్నతస్థాయి సమావేశంలో చర్చించే అంశాల్లో ప్రధానంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ ప్రధాన అంశాలని తెలుస్తోంది. వీటిపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపి, పాదర్శకత, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత, తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తానని తెలిసింది.
హాజరుకానున్న అన్ని శాఖల మంత్రులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సచివాయంలోని ఆరో అంతస్తులో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతోపాటు అన్ని శాఖల మంత్రులు కూడా హాజరు కానున్నారు. అన్ని శాఖల మంత్రులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని సీఎస్ శాంతికుమారి ఆహ్వానించారు. నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని ఆహ్వానం పంపించారు.
దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు 20 రోజులపాటు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ వేడుకల ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి అధికారిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో లబ్ధి కలిగేలా కార్యక్రమాలు రూపొందించారు. వీటి నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై దిశానిర్దేశం చేయనున్నారు.
హరితహారంపైనా..
వచ్చే నెలలో 9వ విడత హరితహారం కార్యక్రమం చేపట్టనున్నారు. ఈమేరకు కూడా కార్యక్రమం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, స్థలాల ఎంపిక, మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిదుల భాగస్వామ్యం తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.
పోడు పట్టాలు, గృహలక్ష్మిపై ప్రచారం..
జూన్ 21న ప్రారంభించే పోడు పట్టాల పంపిణీ, జూలైలో ప్రారంభించే గృహలక్ష్మి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వానికి లబ్ధి కలిగేలా చూడాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈమేరకు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
