Telangana Formation Day- KCR: దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభవార్త..!
గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ.

Telangana Formation Day- KCR: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. కొత్త సచివాలయం ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
పేదలకు ఇళ్ల స్థలాలు..
గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ.. అలాగే రెండో విడత గొర్రెల పంపిణీ ఈనెల 9 నుంచి చేయనున్నట్టు తెలిపారు. ఇక గృహలక్ష్మి పథకం ప్రతీ నియోజకవర్గంలో వేల మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
50 వేల మందికి దళితబంధు..
ఇప్పటివరకు తెలంగాణలో 50 వేల మందికి దళిత బంధు అందించామని కేసీఆర్ ప్రకటించారు. రెండో విడతలో మరో 30 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించారని.. మిషన్ భగీరథకు ఎన్నో అవార్డులు లభించాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ బాధలు లేవన్నారు. హరితహారం ద్వారా పచ్చదనానికి పెద్దపీట వేశామన్నారు. తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని.. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
కుల వృత్తులకు కానుక..
ఈ ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు హక్కులు కల్పిస్తామన్నారు. పోడు భూములకు రైతుబంధు వచ్చేలా చూస్తామని.. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మానవీయ కోణమే ఉంటుందన్నారు. ప్రతీ రంగంలో తెలంగాణ ముందుండి దేశానికి దిక్సూచిగా మారిందని తెలిపారు. దేశంలోనే బలీయమైన ఆర్ధిక శక్తిగా నేడు తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు.
