CM KCR- Pawan Kalyan: కేంద్రంలో బీజేపీ టార్గెట్‌గా జాతీయ రాజకీయాలు ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఇటీవలే ఖమ్మంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. అయితే పార్టీ విస్తరణ పేరుతో వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో కుదిరితే పొత్తు.. కాదంటే టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార వైసీపీపై దూకుడుగా పోరాడుతున్న జనసేనను కేసీఆర్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

CM KCR- Pawan Kalyan
పవన్ గూటి నుంచే చేరికలు..
బీఆర్‌ఎస్ పార్టీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.. తోట చంద్రశేఖర్ చేరిక.. తెలంగాణ సీఎస్ ఎంపిక అన్నీ ఈ కోణంలోనే జరిగాయంటున్నారు. ఇది పవన్ కల్యాణ్‌ను బలహీనపర్చడానికేనన్న ప్రచారం జరుగుతోంది. కాపుల ఓట్లను చీల్చడం ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా చేయాలని.. జగన్‌కు మేలు చేయాలన్నది కేసీఆర్ ఎత్తుగడ అంటున్నారు.
పవన్ ప్రతాపం చూపుతారా..
ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలో అడుగు పెడుతున్నారు. తన వారాహీ వాహన పూజ, నారసింహ యాత్రలో భాగంగా మంగళవారం కొండగట్టు, ధర్మపురిల్లో పర్యటించారు. కొండగట్టులో పూజలు తరవాత ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోల 30 నుంచి 35 అసెంబ్లీ స్థానాల్లో, 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో పోటీపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు.

CM KCR- Pawan Kalyan
కాపులపై గురి..
ఆంధ్రాలో కేసీఆర్ ఎలా అయితే కాపులను టార్గెట్ చేశారో.. తెలంగాణలో అత్యధిక సామాజికవర్గం ఉన్న మున్నూరు కాపులను టార్గెట్ చేయాలని జనసేనాని భావిస్తున్నారు. తెలంగాణలో మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు ఎవరికి వస్తే గెలుపు వారి వెంట ఉంటుందని చెబుతుంటారు. అందుకే పవన్ ఇటీవలి కాలంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీ కాపు నేతలను ఆకర్షించడం వెనుక కూడా తెలంగాణలో ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలన్న వ్యూహం ఉందంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో తనను బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌ను తెలంగాణలో కాపు సామాజికవర్గం ఓట్లను తమ పార్టీకి ఆకర్షించి.. కౌంటర్ ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నట్లుల పొలిటికల్ టాక్.