KCR vs ABN RK : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు మధ్య బావబామ్మర్దుల బంధం ఉంది.. అప్పట్లో కెసిఆర్ చంద్రబాబు పంచన ఉన్నప్పుడు, రాధాకృష్ణ టిడిపి బీట్ చూసినప్పుడు టర్మ్స్ బాగా బలపడ్డాయి.. అవి బావా, బామ్మర్ది అని పిలుచుకునేంత స్థాయికి ఎదిగాయి.. కాలక్రమేణా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ఎండిగా ఎదిగాడు.. చంద్రశేఖర రావు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఇక్కడి వరకు ఒకరిని ఒకరు గెలుక్కోకుండా ఉంటే బాగుండేది.. ఇద్దరు కూడా తిక్క క్యారెక్టర్లు కాబట్టి ఒకరిని ఒకరు గోక్కుంటారు. ఆ తర్వాత ఆయన చండీయాగంలో కలుసుకుంటారు.. ఏర్పాట్లు బాగున్నాయా అని ఒకరంటే.. అంత యాగం చేయడం అంటే మామూలు విషయం కాదని మరొకరు అంటారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆఫీస్ కాలిపోతే ఆగ మేఘాల మీద కేసీఆర్ పరామర్శకు వెళ్తాడు.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో విలువైన స్థలం కూడా ఇస్తాడు.. అదే సమయంలో రాధాకృష్ణ ఆ సమయానికి గులాబీ డప్పు కొడతాడు.. తన ఆత్మ అయిన చంద్రబాబును మాత్రం వదిలిపెట్టడు. ఆ స్తుతి రాగాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు.. ఇదంతా జరుగుతుండగానే కెసిఆర్ ఢిల్లీని శాసించాలని కంకణం కట్టుకున్నాడు.. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాడు.. దేశ రాజధానిలో పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించాడు.. తను నమస్తే, టి న్యూస్ లో కాబోయే భావి భారత ప్రధానిగా ప్రచారం చేయించుకుంటున్నాడు.
కానీ ఇక్కడే రాధాకృష్ణకు కాలుతోంది. ఎవరికి లేని ఇబ్బంది ఆయనకే కలుగుతున్నది.. అందుకే…”ఏమోయ్ కెసిఆర్… నీ బలం ఎంత? నీకున్న ఎంపి స్థానాలు ఎంత? ఢిల్లీలో నువ్వు చక్రాలు తిప్పగలవా? అంతటి నలభై ఏళ్ల ఇండస్ట్రీ అయిన మా చంద్రబాబు వల్లే కాలేదు? నువ్వు మోడీని తట్టుకుంటావా? తట్టుకొని నిలబడతావా?” ఇలా సాగుతుంటాయి రాధాకృష్ణ విసర్లు. మరీ కొంతకాలంగా తన కొత్త పలుకులో చంద్రశేఖర రావును ఏకిపారేస్తున్నాడు. అయితే దీన్ని ఇన్నాళ్లు మౌనంగా భరించిన నమస్తే తెలంగాణ… గట్టి కౌంటర్ ఇచ్చింది..
సవాల్ రెడ్డి పేరుతో ఏకంగా పేజీ ఎడిటోరియల్ రాసింది.. అఫ్కోర్స్ దీన్ని రాసింది ఆ పత్రిక పేపర్ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి అని అందరూ అంటూ ఉంటారు.. ఈ కృష్ణమూర్తి కూడా ఒకప్పుడు ఆంధ్రజ్యోతి కాంపౌండ్ లో పనిచేసిన వాడే.. రాధాకృష్ణకు ట్యూన్ అయి మంటలు మండించే వార్తలు ప్రజెంట్ చేసిన వాడే.. యాదగిరిగుట్ట ఇష్యూ తర్వాత కెసిఆర్ కాంపౌండ్ లోకి వెళ్లిపోయాడు.. ఏకంగా నమస్తే తెలంగాణ పత్రికకు ఎడిటర్ అయ్యాడు.. అప్పటినుంచి పత్రికకు సంబంధించి అన్ని విషయాల్లో కాళ్లు, వేళ్ళు పెడుతున్నాడు.. ఇది సహజంగానే అక్కడి సీనియర్ ఉద్యోగులకు నచ్చడం లేదు.. మహబూబ్ నగర్ ఎడిషన్ లో నిరసనలు కూడా చెలరేగాయి.. ఈ పంచాయతీ కేటీఆర్ సెటిల్ చేయడంతో సద్దుమణిగింది..
ఇక రాధాకృష్ణను టాకిల్ చేసేందుకు కృష్ణమూర్తి ‘సవాల్ రెడ్డి’ పేరుతో రంగంలోకి దిగాడని ఓ ప్రచారం సాగుతోంది.. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఆంధ్రజ్యోతిలోనే పనిచేశాడు. ఆర్కే ఉప్పుతిన్నాడు. ఇప్పుడు తనపేరుతో తిడితే బాగోదు అని ‘సవాల్ రెడ్డి’ అని పేరు పెట్టుకొని తిడుతున్నట్టున్నాడు.. ఇప్పుడు కేసీఆర్ ఉప్పు తింటున్నాడు కాబట్టి.. అంతే తేడా.. ఏ మాటకు ఆ మాట… రాధాకృష్ణ కొత్త పలుకులో ఉన్నంత ఫైర్… సవాల్ రెడ్డి ఎడిటోరియల్ లో లేదు.. రాధాకృష్ణ టెంపర్ మెంట్ ఉన్న జర్నలిస్టు కాబట్టి… దేన్నైనా ఓపెన్ గా రాయగలడు.. కొన్నిసార్లు ఇది రివర్స్ అవుతుంది. అది వేరే లెక్క.. అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ ను రాధాకృష్ణ విమర్శించవచ్చు.. ముందుగానే చెప్పినట్టు వాళ్లు తిట్టుకోగలరు… వెంటనే ఆలింగనం చేసుకోగలరు.. ఎందుకంటే వారిద్దరూ బావ బామ్మర్దులు.. ఇలాంటి రాజకీయాలు చాలా చూశారు.. పాపం… మధ్యలో ఈ సవాల్ రెడ్డిలాంటి వాళ్లే బకరాలయ్యేది.