KCR – Prakash Raj : కేసీఆర్ కన్నడ దోస్త్ ఎక్కడ… పొలిటికల్ స్క్రీన్‌పై కనుమరుగు!?
మోదీకి మేలు చేయడానికే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలను నిజం చేసేలా కేసీఆర్ బీజేపీ కోసమే ప్రచారానికి దూరంగా ఉండి ఉంటారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

KCR – Prakash Raj : కర్ణాటక రాజకీయాల్లో ఐదేళ్ల క్రితం.. తెలంగాణ పొలిటికల్ తెరపై రెండేళ్ల క్రితం.. తళుకుమ్మన్న కన్నడ నటుడు ప్రకాశ్‌రాజ్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా.. తన ప్రియమైన దోస్తును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎందుకు పట్టించుకోవడం లేదు.. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయినా ప్రకాశ్‌రాజ్.. ఇరు బరిలోకానీ, అటు ప్రచారంలో కాని ఎక్కడా కనిపించడం లేదు. కేసీఆర్ కర్ణాక ఎన్నికలకు దూరంగా ఉన్నట్లే.. ప్రకాశ్‌రాజ్ కూడా దూరంగా ఉన్నారా.. లేక మొత్తం రాజకీయా కాడి మధ్యలోనే దించేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా కనీసం ప్రచారంలో కూడా ప్రకాశ్‌రాజ్ లేకపోవడంతో దాదాపు రాజకీయాలకూ దూరం అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..
సిల్వర్ స్క్రీన్‌పై సక్సెస్‌ఫుల్ నటుడిగా రాణిస్తున్న ప్రకాశ్‌రాజ్ పొలిటికల్ స్క్రీన్‌పై మెరవలేకపోతున్నారు. 2019లో తన సొంత రాష్ట్రం కర్ణాటకలోని సెంట్రల్ బెంగళూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేశారు. మితవాద శక్తుల రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు.
మోదీపై విమర్శలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించే నటుడు ప్రకాశ్‌రాజ్. బాలీవుడ్‌తోపాటు తమిళం, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందినరాజ్, తన స్నేహితురాలు మరియు జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు కారణమైన మితవాద మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎన్నికల ముందు కర్ణాటక అంతటా పర్యటించాడు. 2014 తర్వాత తీవ్ర మితవాద శక్తుల పెరుగుదలను హైలైట్ చేయడానికి ‘జస్ట్ ఆస్కింగ్’ హ్యాష్‌ట్యాగ్ చుట్టూ చర్చను రూపొందించడానికి ప్రయత్నించాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేదు..
కర్ణాటక ఎన్నికలు మే 10న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, విపక్ష పార్టీలు, కాంగ్రెస్, జేడీఎస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. మరోమారు గెలవాలని బీజేపీ, అధికార పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తున్నాయి. ప్రచారంలో మూడుపార్టీలు హోరెత్తించాయి. మరో 48 గంటల్లో ప్రచారం ముగియనుంది. కానీ, ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ అడ్రస్సే లేదు. తెలంగాణలో పలుమార్లు పర్యటించి కేసీఆర్ దోస్తుగా ముద్రపడిన ప్రకాశ్‌రాజ్ సొంత రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.
కేసీఆర్ ఆదేశాల మేరకేనా..
కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని పంపుతామని ప్రకటించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా కర్ణాటకలో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తామని తెలిపారు. కానీ ప్రచార పర్వం ముగింపు దశకు చేరినా ఆ రాష్ట్రంలో ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఇక కేసీఆర్ దోస్ట్ అయిన ప్రకాశ్‌రాజ్ కూడా పోటీకి, ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే బీఆర్‌ఎస్ బృందం, ప్రకాశ్‌రాజ్ కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మోదీకి మేలు చేయడానికే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలను నిజం చేసేలా కేసీఆర్ బీజేపీ కోసమే ప్రచారానికి దూరంగా ఉండి ఉంటారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ సంగతి ఎలా ఉన్నా.. ప్రకాశ్‌రాజ్ దూరంగా ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశం.
