CM KCR: కేసీఆర్ ఈ ‘సలహాలరావు’ల నియమకాలు ఆపుతారా?
ప్రభుత్వం దగ్గర ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్లు డజనుకు మందికి పైగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం లక్షలకు లక్షలు జీతం చెల్లిస్తోంది. పైగా ప్రభుత్వం వీరి సేవలు దేనికి అవసరమో చెప్పడం లేదు.

CM KCR: రాజీవ్‌శర్మ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సీఎస్.. పదవీకాలం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాడు. చేసిన మేళ్లను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆయనకు ఏకంగా సలహాదారు పోస్టు కట్టబెట్టాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా చేరాడు. వాస్తవానికి రాష్ట్ర సీఎస్‌గా అతడు పని చేయడమే నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఏపీ కేడర్ అధికారిని తెలంగాణలో సీఎస్‌గా పని చేయించుకోవడం ముఖ్యమంత్రి పనితీరుకు పరాకాష్ట. పైగా ఇదే కేసీఆర్ ‘రాజ్యాగం, విలువలు, గుణాత్మక మార్పు, ఆబ్ కీ బార్ కిసాన్ సర్కారు’ అంటూ వీర లెవల్లో ఉపన్యాసాలు దట్టిస్తాడు. హైకోర్టు మొట్టి కాయలు వేస్తే తప్ప సోమేష్‌కుమార్ తెలంగాణ నుంచి వెళ్లలేదు అంటే రాజ్యాగం, క్యాడ్ నిబంధనలు అంటే వారికి ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులు వ్యవస్థలను నడిపించారంటే ఇప్పటికే ఆశ్యర్యం కలుగుతుంది. ఒక్కోసారి ఇలాంటి వారి చేతిలో వ్యవస్థ బంధీ అయినందుకు బాధ కూడా కలుగుతుంది. ఇప్పటికే దాదాపు డజను మంది మాజీ బ్యూరోక్రాట్లు సలహాదారులుగా నియమితులయ్యారు. వారికి నెలకు 50 లక్షలు( సిబ్బంది, ఇతరత్రా ఖర్చు కలిపి) ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇది సరికాదంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ తరఫున విశ్రాంత ప్రభుత్వ అధికారి పద్మనాభ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. దాన్ని లేఖ రాశారు అనేకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తుర్పారపట్టారు అనడం సబబు.
వారినే ఎందుకు?
ఓ ధరణి.. ఉపాధ్యాయుల బదిలీ జీవో ఇవన్నీ సర్కారును అభాసుపాలు చేసినవి. ఇప్పటికీ ధరణి విషయంలో ప్రభుత్వాన్ని కోర్టు మొట్టి కాయలు వేస్తూనే ఉంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు. ఇప్పటికీ ఈ ధరణి విషయంలో ప్రభుత్వం మాడ్యుల్స్ మారుస్తూనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు కానీ.. ఇప్పటికే ఈ పోర్టల్‌లో నిషేధిత జాబితాలో భూములు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అవుతూనే ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి కూడా ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా గత సీఎస్ సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు. పైగా ఆయన మీద అవినీతి ఆరోపణలున్నాయి. గ్రానైట్ రాయల్టీ స్కాంలో సోమేష్‌కుమార్ పేరు ప్రముఖంగా విన్పించింది. అయినప్పటికీ ప్రభుత్వం అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అవినీతిని ఉపేక్షించబోనని చెప్పే ముఖ్యమంత్రి.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని ఇన్నాళ్లూ నిబంధనలకు వ్యతిరేకంగా సీఎస్‌గా కొనసాగించడమే కాకుండా, ఇప్పుడు అతడు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రత్యేక కార్యదర్శిగా అది కూడా క్యాబినెట్ ర్యాంక్ కల్పించడం ఏంటని ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ ప్రశ్నిస్తోంది.
వారు లేరా?
ప్రభుత్వం దగ్గర ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్లు డజనుకు మందికి పైగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం లక్షలకు లక్షలు జీతం చెల్లిస్తోంది. పైగా ప్రభుత్వం వీరి సేవలు దేనికి అవసరమో చెప్పడం లేదు. పైగా వీరంతా కూడా స్థానిక అధికారులు కూడా కాదు. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేక సలహాదారులుగా నియమించాలి అనుకుంటే ఆర్థికవేత్తలు, న్యాయనిపుణులు, సామాజిక నిపుణులు ఉన్నారు. వారు ఆయా రంగాల్లో విశేషమైన ప్రతిభ ఉన్న వారు. అలాంటి వారిని పక్కన పెట్టి మాజీ బ్యూరోక్రాట్లను తీసుకోవడమే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. కేవలం కేసీఆర్ రాజకీయ ప్రాపకం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ ఆరోపిస్తోంది. దీనిపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాలని భావిస్తోంది. అయితే కేంద్రం విదేశాంగ శాఖ మంత్రిగా జై శంకర్‌ను నియమించింది. ఈయన విదేశాంగ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. అలాగే అజీత్ దోవల్ కూడా రక్షణ శాఖలో గూఢచారిగా పని చేశారు. వీరికి ఉన్న అనుభవం దేశానికి ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వీరిని వివిధ హోదాల్లో నియమించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మాజీ బ్యూరోక్రాట్లను ముఖ్యమంత్రి నియమించడం సరైంది కాదనే ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ చెబుతోంది. కేసీఆర్ కు లేఖ రాసిన పద్మనాభ రెడ్డి.. ఏ విధంగా ప్రభుత్వం పై పోరాటం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.
