Etela Rajender: దక్షిణాదిన అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న మరో రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈమేరకు ఏడాదిగా కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. పార్టీలో చేరికల కోసం ఏడాది క్రితం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నియమించారు. అధికార బీఆర్‌ఎస్ టార్గెట్‌గా చేరికలు ఉంటాయని అందరూ భావించారు. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అధికార పార్టీ నుంచే కాదు, కాంగ్రెస్ నుంచి కూడా చెప్పుకోదగిన నేతలు బీజేపీలో చేరడం లేదు. చేరికలకు ఉత్సాహం చూపి మధ్యలోనే ఆగిపోతున్నారు. ఈ విషయం ఇప్పుడు కమలనాథులను ఆందోళనకు గురిచేస్తోంది. మంతనాల వరకు వచ్చిన నేతలు చేరికకు వెనుకాడుతుండడంపై కషాయ నేతలు ఆరా తీస్తున్నారు.

Etela Rajender
చేరికలతో మరింత జోష్ వస్తుందని..
వివిధ కార్యాక్రమాల ద్వారా ఇప్పటికే బీజేపీ అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అన్న భావన ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీలో చేరికలను ప్రత్సోహించి బీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్‌ను బలహీనపర్చానలని బీజేపీ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగానే చేరికల కమిటీ ఏర్పాటు చేసింది. ఈటల రాజేందర్ విచ్చలవిడిగా నేతల్ని బీజేపీలోకి తీసుకొస్తారని అనుకుకున్నారు. ఈటల కూడా అదే అనుకున్నారు. పార్టీలో నేతల్ని చేర్పించిం తాను బిగ్ లీడర్ అయిపోవాలనుకున్నారు. అయితే అనేక ప్రయత్నాలు చేసినా బీజేపీలో చేరుతున్న వారే లేరు.
కేసీఆర్ కోవర్టులతో చేరికలకు బ్రేక్..
బీజేపీలో కొంతమంది కోవర్టులు ఉన్నారన్న అభిప్రాయం కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. తిన్నింటి వాసాలు లెక్కించేవారి కారణంగానే చర్చల వరకు వస్తున్న నాయకులు చేరికలకు వెనుకాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చర్చలు జరుపుతున్న వివరాలు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చేరవేస్తున్నారని ఈటల రాజేందర్ కూడా ఫీలవుతున్నారు. జాయినింగ్ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్ అవుతున్నాయన్న భావన కమలనాథుల్లో నెలకొంది. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిర్వేదాన్ని తెలియచేస్తున్నాయని కొందరు అంటుంటే.. తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురు లేదని అన్ని పార్టీలు ఆయన గ్రిప్‌లోనే ఉన్నాయని దీంతో తేలిపోతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కోవర్టులెవరు?
కేసీఆర్‌కు చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్స్ వేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? బీఆర్‌ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

Etela Rajender
ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీలనూ కోవర్టుల భయం వెంటాడుతోంది. బీజేపీలో ఇప్పటి వరకూ నిబద్ధులైన నేతలు ఉంటారని అనుకుంటారు. కానీ ఈటల వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆ పార్టీలోనూ భయాందోళన కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే.. ఇప్పుడు కేసీఆర్‌ను చూసి అన్నిపార్టీల నేతలూ ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీలోనే ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితికి చేరుతున్నారు. మరి బీజేపీలో కోవర్టుల వ్యవహారంపై ఈటల చేసిన వ్యాఖ్యలు ఎలాంటి మలుపు తిరుగుతాయో అన్న చర్చ జరుగుతోంది.