DS vs KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ అందరితో ఆడుకుంటాడు. కానీ ఆయనతో ఆడుకున్నది ఒక్కడే. ఆయన డీ. శ్రీనివాస్. అవును వైఎస్ హయాంలో వెలుగువెలిగిన అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేత డీఎస్. వైఎస్ తోపాటు వ్యూహాలు రచించి రెండు సార్లు కాంగ్రెస్ ను ఈ ద్వయం అధికారంలోకి తీసుకొచ్చింది. రాజకీయాల్లో ఆరితేరిన డీఎస్ తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ బలహీనపడడంతో పక్కచూపులు చూశాడు. దీంతో ఈ సీనియర్ ఉపయోగపడుతాడని నమ్మి కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నాడు. ఏకంగా అందలమెక్కించాడు.
ఎవ్వరూ ఊహించని విధంగా డీఎస్ కు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిచ్చి రాజ్యసభ సీటును ఇచ్చాడు. అయితే డీఎస్ మాత్రం తన కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కోసం.. ఇతడిపై ఎంపీ ఎన్నికల్లో పోటీకి దిగిన కేసీఆర్ కుమార్తె కవితను ఓడగొట్టాడానికి సహకరించాడని ప్రచారం సాగింది. టీఆర్ఎస్ లో ఉన్న ధర్మపురి శ్రీనివాస్.. తన కుమారుడు బీజేపీ ఎంపీగా గెలవడం కోసం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశాడని.. తనను ఓడగొట్టాడని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం చెడింది.
నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచాక తన తండ్రి డీఎస్ ని బీజేపీలోకి ఆహ్వానించారు. అమిత్ షాను కలిపించి ఒత్తిడి తెచ్చాడు. అయితే డీఎస్ ఆ పార్టీలో చేరితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద డీఎస్ కు టీఆర్ఎస్ ఇచ్చిన రాజ్యసభ సీటు పోయే ప్రమాదం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీకి దగ్గరగా ఉంటూనే డీఎస్ ఆ పార్టీలో చేరకుండా రాసుకుపూసుకు తిరిగాడు.
ఇక టీపీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి సైతం డీఎస్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాడు. అప్పుడు కూడా డీఎస్ మళ్లీ కాంగ్రెస్ తో సాన్నిహిత్యంగా మెలిగారు. కానీ అధికారికంగా కాంగ్రెస్ లో చేరలేదు.
డీఎస్ ను పార్టీ నుంచి సాగనంపాలని.. ఆయన రాజ్యసభ సీటును లాగేసి కూతురు కవితకు ఇవ్వాలని కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు.అయితే కేసీఆర్ ఎత్తులు తెలిసి ప్రతీసారి చిక్కడు దొరకడులా డీఎస్ అస్సలు చాన్స్ ఇవ్వలేదు. డీఎస్ విషయంలో కేసీఆర్ ఈ ఆరేళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయన రాజ్యసభ సీటుకు ఎసరు తేలేకపోయాడు.
రాజకీయ చాణక్యుడు అన్న కేసీఆర్ నే ముప్పుతిప్పలు పెట్టిన డీఎస్ తన పూర్తి పదవీకాలం 6 ఏళ్లు రాజ్యసభ సీటును అనుభవించాడు. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. డీఎస్ పదవీకాలం పోయింది. డీఎస్ తోపాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా రిటైర్ అవ్వబోతున్నాడు. మరి ఈ రెండింటిలో కేసీఆర్ ఎవరికి చాన్స్ ఇస్తాడు? కూతురిని రాజ్యసభ ఎంపీగా ఢిల్లీకి పంపుతాడా? వేరొకరికి చాన్స్ ఇస్తాడా? అన్నది వేచిచూడాలి.
Recommended Videos