సేమ్.. సీన్… నాడు ఏం జరిగిందో.. నేడు కూడా అదే జరుగుతున్నది.. గతంలో ఈడి అధికారులు కవితను ప్రశ్నించేందుకు హైదరాబాద్ లోని ఆమె నివాసానికి వచ్చారు. అయితే అంతకుముందే ఆమె ప్రగతి భవన్ వెళ్లారు. న్యాయ నిపుణులతో చర్చించారు.. తర్వాత అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇక శనివారం కవిత విచారణకు హాజరైన నేపథ్యంలో ఇప్పుడు కూడా ప్రగతి భవన్ లో అలాంటి సన్నివేశమే చోటు చేసుకుంటుంది..
ఇక నిన్న కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు, ఢిల్లీ పోలీసులు ఆయా చోట్ల మోహరించారు. 144 సెక్షన్ విధించారు. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరగగా.. శనివారం అలాంటిదేమీ లేకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
వాస్తవానికి విచారణ గంటల తరబడి కొనసాగుతున్న కొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందారు. సాధారణంగా సాయంత్రం 6గంటల తర్వాత విచారణ కొనసాగదు. కానీ, కవితను 6గంటల తర్వాత కూడా విచారించడం, ఈడీ కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో శ్రేణుల్లో ఆందోళన మరింత పెరిగింది. అరెస్టు తప్పదన్న ప్రచారం ప్రారంభమైంది. కానీ, చివరికి రాత్రి 8గంటలకు ఈడీ అధికారులు విచారణ ముగించడం, ఈ నెల 16న మరోసారి హాజరు కావాలని చెప్పి పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోసారి హాజరు కావాల్సి ఉండడంతో ఇంకా కొంత ఆందోళనతో ఉంది. కాగా, విచారణ నుంచి బయటికి వచ్చిన కవిత ఉత్సాహంగానే కనిపించారు. కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు చేసినట్లుగానే.. బయటికి వచ్చినప్పుడు కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాత్రి ఢిల్లీలోని తన నివాసం వద్దకు చేరగానే అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో మోతెక్కించారు. ఇంట్లోకి వెళ్లాక మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతితో కవిత కాసేపు మాట్లాడారు. అనంతరం కవిత, మంత్రులు సహా ఇతర బీఆర్‌ఎస్ నేతలు రాత్రి 9గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. రాత్రి 11గంటల తరువాత వారు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
కవిత, కేటీఆర్, హరీశ్‌రావు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆదివారం వారంతా ప్రగతిభవన్‌లోనే ఉండనున్నట్లు, ఈడీ విచారణపై న్యాయనిపుణులతో చర్చించనున్నట్లు తెలిసింది. ఈ చర్చల్లో ఖమ్మం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కొడుకు పాల్గొంటున్నట్టు తెలిసింది.. రస్తమైన రెవెన్యూ శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్నారు. గతంలో కవితను విచారించినప్పుడు ఈయన సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనను తమ వద్దకు పిలిపించుకొని మార్చి 16వ తేదీన అధికారులు అడిగే ప్రశ్నలకు, ఎలాంటి సమాధానాలు చెప్పాలో వంటి విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కవిత, కేటీఆర్, హరీష్ రాకతో ప్రగతి భవన్ వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మంత్రులను ఎవరినీ అటు దరిదాపుల్లో కూడా రానివ్వడం లేదు. నిన్న కవిత వెంట ఉన్న మహిళా మంత్రులు, ఇతర మంత్రులు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే వారి క్వార్టర్స్ కి వెళ్ళిపోయారు. మొదట్లో ప్రగతి భవన్ వెళ్తారు అనుకున్నప్పటికీ.. కేవలం హరీష్, కేటీఆర్, మాత్రమే వెళ్లారు. మిగతా వారిని రా వద్దని ఆదేశాలు జారీ చేశారు.