Karnataka Election Results: కర్ణాటక ఫలితాలు..తెలుగు రాష్ట్రాల్లో మారనున్న ఈక్వేషన్స్
కాంగ్రెస్ అధికారం చేపడితే మాత్రం బెంగళూరులోని జగన్ ఆస్తులకు ఈసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఏపీలో సైతం జగన్ ప్రత్యర్థులకు కాంగ్రెస్ సాయమందించే చాన్స్ ఉంది. అదే బీజేపీ విజయం సాధిస్తే.. కొంతలో కొంత జగన్ కు రిలీఫ్ ఖాయమని చెప్పక తప్పదు.

Karnataka Election Results: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలకే దిక్సూచిగా నిలవనున్నాయి. ఇక్కడి ఫలితాలు అంతగా ప్రభావం చూపనున్నాయి. అందుకే యావత్ భారతావని ఇప్పుడు కర్నాటక వైపు చూస్తోంది. ఏ పార్టీ గెలుస్తుందన్నది మరి కొద్ది గంటల్లో తెలియనుంది. మధ్యాహ్నం 11 గంటలకు ఒక క్లారిటీ రానుంది, అయితే తెలుగు రాష్ట్రాల్లో కర్నాటక రిజల్ట్స్ ఫీవర్ నెలకొంది. అక్కడి ఫలితాలు బట్టి ఇక్క రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. అక్కడ గెలుపోటములు నిర్దేశించుకున్న తరువాత రాజకీయ పార్టీలు నిర్ణయాలు మార్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో హీట్..
తెలంగాణ రాజకీయాలను కర్నాటక ఫలితాలు హీటెక్కించే అవకాశముంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ బాస్ కు గడ్డు పరిస్థితులు మొదలైనట్టే. ఆది నుంచి కర్నాటకలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని ప్రచారం జరిగింది. ఆ ప్రతికూలతలు అధిగమించి బీజేపీ విజయం సాధిస్తే మాత్రం కేసీఆర్ కు చుక్కలు చూపించనున్నారు. ఆ ఆత్మవిశ్వాసంతో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదపనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక తరువాత తెలంగాణనే టార్గెట్ చేయనున్నారు. మరింత దూకుడు కనబరిచే అవకాశముంది. అదే జరిగితే కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయం.
కాంగ్రెస్ గెలిస్తే..
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం దేశ వ్యాప్తంగా సానుకూల పవనాలు ప్రారంభం కానున్నాయి. జవసత్వాలు వచ్చి అనతికాలంలోనే పార్టీ బలోపేతమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పని దాదాపు అయిపోయిందన్న ప్రచారం జరిగే ప్రతీ సందర్భంలో సంద్రంలో అలలా ఉవ్వెత్తున ఎగసింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. కర్నాటకలో కానీ గెలుపొందితే.. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తిరుగుండదు. నాయకులు కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశముంది. అదే జరిగితే.. కాంగ్రెస్ దూకుడును ఎదుర్కోవటం కేసీఆర్ కు కష్టమే అవుతుంది. కర్ణాటక సానుకూలతతో తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవటానికి సర్వ శక్తుల్ని ఒడ్డేందుకు అవకాశం ఉంది.
జగన్ కు ఇబ్బందే..
అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్తా విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఏ పార్టీ గెలిచినా సీఎం జగన్ కు ఇబ్బందేనన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారని జగన్ పై అధి నాయకత్వానికి కోపంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారం చేపడితే మాత్రం బెంగళూరులోని జగన్ ఆస్తులకు ఈసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఏపీలో సైతం జగన్ ప్రత్యర్థులకు కాంగ్రెస్ సాయమందించే చాన్స్ ఉంది. అదే బీజేపీ విజయం సాధిస్తే.. కొంతలో కొంత జగన్ కు రిలీఫ్ ఖాయమని చెప్పక తప్పదు. ఇప్పుడున్న సాయమే కొనసాగుతుంది. అయితే కర్నాటకలో హంగ్ వస్తే మాత్రం టీడీపీ, జనసేన గూటికి బీజేపీ తప్పక రావాల్సిన పరిస్థితి.
