Karnataka Elections Result 2023: కర్ణాటక ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై పడనుందా?
తెలుగురాష్ట్రాల్లో బీజేపీ తెలంగాణలో మాత్రమే గట్టిపోటీనిస్తోంది. ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు తామే ప్రత్యమ్నాయం అంటూ ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలుపొందినా.

Karnataka Elections Result 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించినట్లే ఓడిపోయింది. దీంతో దక్షిణాదిలో ప్రస్తుతం బీజేపీకి ఒక్క రాష్ట్రం కూడా లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని కమలనాథులు కత్తులు నూరుతున్నారు. రాబోయే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా అధికారం చేజిక్కించుకోకపోయినా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వంలో ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల పార్టీలు బీజేపీని ఆదరిస్తాయా? కర్ణాటకలో ఓడిపోయిన ఆ పార్టీతో కలిసి వెళ్తే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందోనని చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ సొంత ప్లాన్ ఏంటి? ప్యూచర్లో ఏం చేయాలనుకుంటోంది?
తెలుగురాష్ట్రాల్లో బీజేపీ తెలంగాణలో మాత్రమే గట్టిపోటీనిస్తోంది. ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు తామే ప్రత్యమ్నాయం అంటూ ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలుపొందినా.. ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన పరిణామాలతో కమలం గట్టి పునాదే వేసుకుంది. అయితే బీజేపీ విషయంలో యూత్ ఫాలోయింగ్, కొన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతున్నా.. ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని కొన్ని సర్వేలు బయటపెట్టాయి. ఈ క్రమంలో కొందరు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని అన్నారు. కానీ స్వయంగా పోటీ చేస్తామని ఆ పార్టీ నాయకులు పదే పదే చెబుతున్నారు.
ఏపీ విషయానికొస్తే బీజేపీ తో జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే కొన్ని రోజులుగా ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు ఖాయమైతే చంద్రబాబు బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో స్నేహ హస్తం అందించిన తనను బీజేపీ మోసం చేసిందని పలుసార్లు ఆరోపించారు. అయితే అధిష్టానానికి వెళ్లి మాత్రం మోడీ, ఇతర ప్రముఖులను కలిసి వస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక ఫలితాలు చూసిన తరువాత చంద్రబాబు నిర్ణయం మారుతుందని అంటున్నారు. దీంతో పవన్ సైతం చంద్రబాబు బాటలోనే వెళ్తారన్న చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో కమలనాథులు తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నారు. ఏపీ విషయంలో అవసరమైతే చంద్రబాబుతో మరోసారి చర్చలు జరిపి వైసీపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుక సహకారం అందిస్తామని చెప్పనున్నారు. ఆ మధ్య అమరావతి సమయంలో టీడీపీ మాత్రమే ఉద్యమంలో పాల్గొంటే బీజేపీ నాయకులను చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. ఎప్పటికైనా చంద్రబాబు అవసరం వస్తుందనే ఉద్దేశంలోనే ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక ఫలితాలు చూసిన తరువాత కూడా చంద్రబాబు నిర్ణయం మారకుండా ఉంటుందా? అని అనుకుంటున్నారు.
అటు తెలంగాణలో ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు పార్టీలోకి వచ్చి తిరిగి సొంతగూటికి వెళ్లిన వారున్నారు. మరోవైపు ఆధిపత్య పోరుతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో కన్ఫ్యూజన్ గా ఉంది. ఇలాంటి సమయంలో ఇతర పార్టీల నుంచి నాయకులు బీజేపీలోకి రావడానికి ధైర్యం చూపడం లేదు. ఇక ఇక్కడ కాంగ్రెస్ తప్ప మరోపార్టీతో పొత్తు పెట్టుకునే స్థాయిలో లేవు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేరు. ఈ క్రమంలో ఒంటరిగానైనా ఏదో రకంగా ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వాలని చూస్తున్నారు.
