Karnataka Elections History: కర్ణాటక ఎన్నికలు : 40 ఏళ్లు, 18 మంది ముఖ్యమంత్రులు… ఐదేళ్లు పాలించింది ముగ్గురే
2018లో గెలిచే ఊపులో కనిపించిన కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పని చేయకపోతే ఎంత నష్టమో అనుభవంలోకి రావడంతో ఈసారి మారింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 38.14%, భారతీయ జనతా పార్టీకి 36.35%, జెడిఎస్ కు 18.3% ఓట్లు వచ్చాయి.

Karnataka Elections History: కర్ణాటక రాష్ట్రం రాజకీయ అస్థిరతకు మారుపేరు. ఈ మాట అనడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ, సందేహం కానీ లేవు. గడిచిన 40 ఏళ్లలో 18 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ముగ్గురు మాత్రమే పూర్తి కాలం పాటు పాలించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం మరుగున పడిపోయింది. కానీ కర్ణాటక రాష్ట్రం రాజకీయ ఆస్థిరతకు, క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరు.
18 మంది ముఖ్యమంత్రులు
1983 నుంచి 18 మంది ముఖ్యమంత్రిలు కర్ణాటక రాష్ట్రాన్ని పాలించారు.. ఈ జాబితాలో ముగ్గురు మాత్రమే కర్ణాటక రాష్ట్రాన్ని పూర్తి ఐదేళ్ల కాలం పాలించారు. 1999-2004 మధ్య కాంగ్రెస్ తరఫున ఎస్ఎం కృష్ణ, 2013_2018 మధ్య కాంగ్రెస్ తరపున సిద్ధరామయ్య మాత్రమే పూర్తి కాలం పాలించారు. 1983లో జనతా పార్టీని గెలిపించి రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి అయ్యాడు. 1984 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ కేవలం నాలుగు ఎంపీ స్థానాల్లోనే గెలవడంతో తాము ప్రజా మద్దతు కోల్పోయామని భావించి శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడు. 1985లో జరిగిన ఎన్నికల్లో 139 స్థానాలు గెలిచి తిరుగులేని ప్రజాభిమానం ఉందని నిరూపించుకున్నాడు. ఇక మైసూర్ రాష్ట్రం కర్ణాటక గా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే 1989లో హస్తం పార్టీ 178 స్థానాలు గెలిచింది. ఇది ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రికార్డు.
అందువల్లే బిజెపి బలపడింది
జనతా పార్టీ తర్వాత జనతాదళ్, జనతాదళ్ సెక్యులర్(దేవే గౌడ), జనతాదళ్ యునైటెడ్ (జే హెచ్ పాటిల్), లోక్ శక్తి (రామకృష్ణ హెగ్డే) ఇలా అనేక చీలిక పేలికల మధ్య 1994 నుంచి కర్ణాటక రాష్ట్రంలో బిజెపి బలపడుతూ వస్తోంది. 1989 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. కేవలం ఐదు సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ఆ నాలుగు స్థానాలను 40 కి పెంచుకొని తిరుగులేని ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.
ఇవి చేయకుండా ఉండి ఉంటే..
ఇక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప కు బిజెపి టికెట్ ఇవ్వకపోవడంతో వారు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ ప్రయోగం బిజెపికి పూడ్చలేని నష్టాన్ని చేకూర్చింది. ఈ జాబితాలో బళ్లారి శ్రీరాములు కూడా ఉండేవాడు. బోయ సామాజిక వర్గం నుంచి సమీప భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయ నేత లేకపోవడంతో ఆయనకు సీటు దక్కింది. లేకుంటే శ్రీరాములు తన రాజకీయ గురువు గాలి జనార్దన్ రెడ్డి పార్టీలో చేరాల్సి వచ్చేది. యడ్యూరప్పకు అధిష్టానం చెక్ పెడితే.. కురబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్పకు యడ్యూరప్ప చెక్ పెట్టి టికెట్ రాకుండా చేశాడు.. లింగాయత్ నేతలైన యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్ కు ఉమ్మడిగా బిఎల్ సంతోష్ చెక్ పెట్టాడు.. ఈ ఎన్నికలు మొత్తం బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో జరిగాయి. చివరికి ప్రధాని పర్యటనలో బసవరాజు బొమ్మై, యడ్యూరప్ప కనిపించలేదంటే బి ఎల్ సంతోష్ ఏ స్థాయిలో మంత్రాంగం నడిపాడో అర్థం చేసుకోవచ్చు. చివరి మూడు రోజుల్లో ప్రధానమంత్రి నిర్వహించిన రోడ్ షోలలో ప్రజలకు పెద్దగా తెలియని చలవరాయ స్వామి, బెంగళూరు సెంట్రల్ ఎంపీ మోహన్ మాత్రమే ఎక్కువ కనిపించారు.. ఇక మల్లేశ్వరంలో జరిగిన రోడ్ షోలో స్థానిక ఎమ్మెల్యే అశ్వథ నారాయణ కనిపించలేదు.. ఇక సీట్ల పంపకం, ప్రచార బాధ్యతలు గమనిస్తే బిజెపి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని భావించినట్టు తెలుస్తోంది. కానీ అనుభవం ముందు కొత్త రక్తం ఓడిపోయింది.
కాంగ్రెస్ పార్టీ మారింది
2018లో గెలిచే ఊపులో కనిపించిన కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పని చేయకపోతే ఎంత నష్టమో అనుభవంలోకి రావడంతో ఈసారి మారింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 38.14%, భారతీయ జనతా పార్టీకి 36.35%, జెడిఎస్ కు 18.3% ఓట్లు వచ్చాయి. కానీ సీట్ల విషయంలో బిజెపి 104 గెలుచుకొని అధికారాన్ని చేపట్టింది. అయితే తాము చేసిన తప్పిదం వల్లే బిజెపి అధికారంలోకి వచ్చిందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కలిసికట్టుగా పనిచేసింది. అంతేకాదు తనపై జరిగిన ఐటీ దాడులకు సమాధానం చెప్పాలనుకుని శివకుమార్ ఈసారి కసిగా పని చేశారు. మల్లికార్జున ఖర్గే ను కూడా సమన్వయం చేసుకున్నారు.. చివరికి ఎన్నికల్లో గెలిచారు. రాజకీయ అస్థిరతకు మారుపేరైన కర్ణాటక రాష్ట్రాన్ని సుస్థిరతవైపు పయనించేలా అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తున్నది.
