IT Layoffs: అభ్యాసం కూసు విద్య అంటారు.. ఇది ఉద్యోగానికి సంబంధించి కూడా వర్తిస్తుంది.. రొటీన్ గా చేసుకుంటూ వెళ్తే ఉద్యోగం బోర్ కొడుతుంది.. జీవితం కూడా బోర్ కొడుతుంది. జీవితంలో అప్డేట్ అయినట్టే… ఉద్యోగంలో కూడా అప్డేట్ కావాల్సిందే.. లేకుంటే అంతే సంగతులు.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నేర్పుతున్న పాఠం కూడా అదే.. 2008లో మహా మాంద్యం తలెత్తినప్పుడు ఐటీ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి.. కంపెనీలు దివాలా తీశాయి.. అయితే నైపుణ్యం ఉన్న ఉద్యోగులు మాత్రం కంపెనీలు అలాగే అట్టిపెట్టుకున్నాయి.. నైపుణ్యం లేని వారిని, పోటీ ప్రపంచానికి అనుగుణంగా అప్డేట్ కాని వారిని తొలగించాయి.

IT Layoffs
ఇప్పుడు కూడా అదే పరిస్థితి
ఏ రంగంలో అయినా మూస పద్ధతిలో పనిచేస్తే ఎదుగు బొదుగు ఉండదు. అలాంటివారు కొద్దిరోజులు అయిన తర్వాత ఉద్వాసనకు గురికావాల్సిందే.. ఇప్పుడు అలాంటి వారే ఉద్యోగాలను కోల్పోతున్నారు.. ఆర్థిక పరిస్థితులు బాగున్నంతవరకు వారందరినీ భరించిన ఐటీ సంస్థలు… ఇప్పుడు వదిలించుకుంటున్నాయి. మార్కెట్ బాగో లేకపోవడం, కొనుగోళ్ళు నిలిచిపోవడంతో అవి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.. ఇది బాధాకరమే అయినప్పటికీ కంపెనీలకు తప్పడం లేదు.. అమెరికన్ కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.. ఇందుకు అవి చెప్తున్న కారణం ఉద్యోగుల్లో నైపుణ్యాలు లేకపోవడమే.. మరోవైపు కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మారిన టెక్నాలజీ ఆధారంగా వస్తున్నాయి.. ఈ టెక్నాలజీని అంది పుచ్చుకోలేనివారు రేసులో వెనుకబడుతున్నారు.. కంపెనీల అవసరాలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్నారు.. దీంతో వారిని భరించే స్తోమత లేక కంపెనీలు వదిలించుకుంటున్నాయి.
అప్డేట్ కావాల్సిందే
రొడ్డకొట్టుడు జీవితం ఎప్పటికైనా బోర్ కలిగిస్తుంది. ఇది ఉద్యోగానికి కూడా వర్తిస్తుంది.. మిగతా వెంటో తెలియదు గాని ఐటీ ఉద్యోగానికి సంబంధించి మాత్రం ఎప్పటికీ అప్డేట్ కావాలి.. ఒకప్పుడు సి ప్లస్ హవా ఉండేది.ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది.. రేపటి నాడు ఏం జరుగుతుందో తెలియదు. అలాగని రేపటి గురించి ఆలోచించకుండా మానేయలేం కదా! అందుకే కొత్త కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవాలి.

IT Layoffs
నేర్చుకోవాలి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు తమను తాము మార్చుకోవాలి. అలాంటి వారికే భవిష్యత్తు ఉంటుంది. డిమాండ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మీడియా విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. కోవిడ్ సమయంలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు ప్రింట్ మీడియా జర్నలిస్టులను తొలగించాయి. జర్నలిస్టులకు ఆ వృత్తి తప్ప ఇతర వ్యాపకం ఉండదు. అలాంటి వారికి డిజిటల్ మీడియా చాలా అవకాశాలు కల్పించింది.. లేకుంటే వారంతా నడిరోడ్డు మీద పడేవాళ్లు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రావడంతో భవిష్యత్తు మొత్తం దీనిదే అని అవగతం అవుతున్నది.. మొదట్లో చెప్పుకున్నట్టు అభ్యాసం కూసు విద్య.. అలాగే నేర్చుకుంటేనే ఉద్యోగం.. కష్టపడితేనే ఉద్యోగ భద్రత!