
pawan kalyan
AP MLC Election- Janasena: విశాఖను రాజధాని చేస్తున్నామంటూ వైసీపీ నేతలు ఊదరగొట్టారు. ఉగాది తర్వాత నుంచి విశాఖకు వేదికగా పాలన సాగిస్తామంటూ సీఎం చెప్పకనే చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ తో విశాఖ ఖ్యాతిని మారుమోగించామని గొప్పలు పోయారు. ఇన్ని చేసిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు మాత్రం అధికార వైసీపీకి ఝలక్ ఇచ్చారు. ఇది దేనికి సంకేతం అన్న చర్చా ఇప్పుడు సర్వత్రా సాగుతోంది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వేపాడ చిరంజీవి రావు చేతిలో అధికార వైసీపీ నుంచి పోటీ చేసిన సీతం రాజు సుధాకర్ ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాల్లో 2,89,214 మంది ఓటర్లు ఉండగా, 2,01,335 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 12,318 ఓట్లు చెల్లనివి కాగా, 1,89,017 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు నిర్ధారించారు. వీటిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు 82,957 ఓట్లు పడగా, వైసీపీ అభ్యర్థి సీతమ్మరాజు సుధాకర్ కు 55,749 ఓట్లు పడ్డాయి. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు వైసిపి అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 28,208 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక పిడిఎఫ్ నుంచి పోటీ చేసిన కోరెడ్ల రమాప్రభకు 35,148 ఓట్లు లభించగా, బిజెపి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎం మాధవ్ 10,884 ఓట్లు సాధించి డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 37 మంది అభ్యర్థులు పోటీ పడగా, 34 మంది డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. మొదటి ప్రాధాన్యత ఓటులో విజయానికి అవసరమైన అన్ని ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనివార్యమైంది. టిడిపి అభ్యర్థి వ్యాపాడ చిరంజీవి ప్రాధాన్యత ఓట్లుతో విజయం సాధించారు.
తీర్పు దేనికి సంకేతం..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆరు జిల్లాల్లోని 34 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లతో కూడుకుని ఉన్నది. ఈ ఎన్నికల్లో విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటినుంచి వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున తమ నిరసనను, ప్రభుత్వంపై తమకున్న వ్యతిరేకతను ఓటు ద్వారా తెలియజేశారు. దీంతో ముందుగా అనుకున్నట్లుగా ఈ ఎన్నిక హోరాహోరీగా సాగలేదు. తొలి రౌండు నుంచి తుది రౌండ్ వరకు టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి కనబరిచారు. గట్టి పోటీ ఉంటుందని భావించిన పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ నుంచి ఆశించిన స్థాయిలో పోటీ రాకపోవడం కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది. విశాఖను రాజధానిగా చేస్తున్నామని, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నిక వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఫ్రీ ఫైనల్గా భావిస్తామని చెప్పిన వైసీపీ నేతలకు తాజా ఫలితం చేదు గుళిక గానే భావించాలి. ముఖ్యంగా వైసీపీ విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు ఈ రూపంలో తెలియజేశారు అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.
కలిసి వచ్చిన అంశాలు..
వైసిపి ప్రభుత్వం పట్ల ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉన్న వ్యతిరేకత టిడిపికి కలిసి వచ్చింది. అలాగే సుమారు 25 ఏళ్లపాటు అధ్యాపక వృత్తిలో ఉన్న వేపాడ చిరంజీవిరావును అభ్యర్థిగా దించడం కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా కలిసి వచ్చింది. ఎకానమీ ప్రొఫెసర్గా ఈ ప్రాంత నిరుద్యోగులకు విద్యార్థులకు సుపరిచితులైన చిరంజీవి రావు విజయానికి వారంతా ఎంతగానో కృషి చేశారు.

pawan kalyan
జనసేన పాత్ర అత్యంత కీలకము..
ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో జనసేన పాత్ర అత్యంత కీలకంగా ఉందన్న భావన నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉన్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ పిలుపును సీరియస్ గా తీసుకున్నారు. ఒకానొక దశలో కోరెడ్ల రమాప్రభకు ఓటు వేయాలని చాలామంది భావించినప్పటికీ, చిరంజీవి మాస్టారుకు వేయడం ద్వారా విజయసంకేతం చూపించవచ్చని భావించి ఆ దిశగా ఓట్లు వేశారు. చిరంజీవి మాస్టారు సాధించిన ఓట్లలో టిడిపి ఓట్లు ఎంతున్నాయో, అంతకంటే ఎక్కువ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఓట్లు, పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు ఉన్నాయన్నది స్పష్టమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోమన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎన్నికల్లో కార్యరూపం దాల్చడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులను ఈ తరహా ఫలితాలు రావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకతాటి పైకి రావాల్సిన అవసరం ఉందన్న భావనను నిపుణులు విశ్లేషిస్తున్నారు.