Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పొత్తులపై ఎవరికి వారే అనుకూలంగా చూసుకుంటున్నారు. ఇన్నాళ్లు బీజేపీతో అంటకాగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు దానితో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పొత్తు ఉన్నా ఎక్కడ కూడా జనసేన, బీజేపీ కలిసి పోరాడిన సంఘటనలు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని అధికారంలో కూర్చోబెట్టే క్రమంలో బీజేపీతో ఉంటే లాభం లేదనుకుని టీడీపీతో పొత్తుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 31న విశాఖ వెళ్లేందుకు పర్యటన ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేదిక ద్వారానే కేంద్ర ప్రభుత్వంపై తన వైఖరి ప్రదర్శించనున్నట్లు సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో జరిగే నష్టాలపై ఇదివరకే ప్రధాని మోడీకి పవన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కానీ కేంద్రం కూడా ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని చెప్పడంతో ఇప్పుడు కేంద్రంతో సంబంధాలు కట్ చేసుకునేందుకే పవన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
జనసేన పార్టీని విస్తృతం చేసేందుకు పవన్ కల్యాణ్ త్వరలో జిల్లాల పర్యటన ఉంటుందని తెలుస్తోంది. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మండల స్థాయి కమిటీలు వేయాలని భావిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పినా పవన్ కల్యాణ్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీతో పొత్తుతో ఏం ప్రయోజనం లేదని అనుకుంటున్న నేపథ్యంలోనే ఆ పార్టీతో భవిష్యత్ ఉండదనే కారణంతో దూరం కావాలని భావిస్తున్నారని సమాచారం. బీజేపీతో పొత్తు కంటే టీడీపీతోనే లాభం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే దానితో జత కట్టేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జత కట్టి పార్టీని అధికారంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.