Pawan Kalyan: జనసేనాని పవన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. వారాహి ప్రచార రథం అన్ని హంగులతో సిద్ధమైంది. తెలంగాణలోని కొండగట్టులో రథానికి తొలిపూజ నిర్వహించారు. ఇప్పుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిని దర్శించుకొని వాహన పూజ చేయనున్నారు. పనిలో పనిగా విజయవాడలో రెండు రోజుల పాటు బస చేయనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోనున్నారు. కొన్ని రాజకీయ నిర్ణయాలకు, పార్టీ చేరికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పవన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Pawan Kalyan
ఇప్పటికే ఏపీలో విపక్షాల మధ్య పొత్తులకు ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. పొత్తులపై పవన్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకొస్తున్నారు. జనసేనతో బీజేపీ కలిసి వస్తుందని చెబుతూ వస్తున్నారు. అటు బీజేపీ సైతం పవన్ జనసేన విషయంలో సానుకూలత ప్రదర్శిస్తూ వస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో టీడీపీ, వైసీపీతో పొత్తులుండవని తేల్చేశారు. జనసేన పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఇంకా ఆ పార్టీ పవన్ మైత్రిని కోరుకుంటున్నట్టు తేలింది. అయితే వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రయత్నం చేస్తున్న పవన్ తనతో కలిసి వచ్చేవారితో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. టీడీపీ పై సానుకూలత ప్రదర్శిస్తున్నారు. అటు చంద్రబాబు సైతం 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళితే మంచి సానుకూల ఫలితాలొస్తాయని భావిస్తున్నారు. అయితే అందుకు బీజేపీ సుముఖంగా లేదని ఆ పార్టీ రాజకీయ తీర్మానంలో పేర్కొంది.

Pawan Kalyan
బీజేపీ తనతో కలిసే ఉందని పవన్ భావిస్తున్న వేళ కీలక రాజకీయ నిర్ణయాలపై అచీతూచీ అడుగులు వేయాల్సి వస్తోంది. ముఖ్యంగా బీజేపీ ముఖ్యనేత కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరిక పై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా జనసేనలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఆయనకు విభేదాలున్నాయి. తాజాగా బీజేపీ హైకమాండ్ ఎన్నికల వరకూ సోము వీర్రాజు అధ్యక్షుడిగా కొనసాగుతారని సంకేతాలివ్వడంతో కన్నా అనుచరులు పెద్దఎత్తున పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వారంతా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే బీజేపీ వైఖరి కోసం వేచిచూసే ధోరణిలో ఉన్న పవన్ కన్నాతో పాటు అనుచరులను చేర్చుకుంటారా? లేకుంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.కన్నా అనుచరులు మాత్రం రిపబ్లిక్ డే వేడుకల అనంతరం పవన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా పవన్ బస్సు యాత్ర ప్రారంభించలేదు. ఇంతలోనే చేరికలు ఈ స్థాయిలో ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర సమయంలో భారీగా వలసలు ఉంటాయని అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి.