Jamili Elections: మోడీ మదిలో అస్త్రాలు: దేశ రాజకీయాలను షేక్ చేసే మరో బిల్లు తీసుకువచ్చేందుకు ప్లాన్
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీన ముగిశాయి. డిసెంబర్ నెలలో శీతాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా.. ఈలోపే ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం కలకలం రేపుతోంది.

Jamili Elections: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో.. ఇక ఇప్పట్లో మోడీ ప్రభుత్వం సమావేశాలు నిర్వహించే అవకాశం లేదని అందరూ అనుకున్నారు. కానీ శీతాకాల సమావేశాల కంటే ముందే మోడీ ప్రభుత్వం ఆకస్మాత్తుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషి గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. అమృత్ కాల్ సంబరాల వేల జరుగుతున్న ఈ సమావేశాలు ఫలఫ్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక సమావేశాలు పార్లమెంటు పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలో ముగుస్తాయని తెలుస్తోంది. అయితే ఈ సమావేశాల ఎజెండా ఏమిటి అనేది కేంద్ర మంత్రి వెల్లడించలేదు. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు పేరుతో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం వివచిస్తున్నట్టు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టి దేశంలో పెద్ద ఎత్తున మహిళల అభిమానం చురగొనాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ జమిలి ఎన్నికలు సాధ్యపడని పక్షంలో లోక్సభ ఎన్నికలను కొద్దిగా ముందుకు జరిపి సాధ్యమైంది రాష్ట్రాలతో కలిపి పాక్షికంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఏమైనప్పటికీ ఈ సమావేశాల్లో మోడీ ప్రభుత్వం అనూహ్యమైన, అసాధారణమైన చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, ఈ చర్యలు దేశ ప్రజల దృష్టిని మళ్లించి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అనుకూల వాతావరణం ఏర్పరచవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆగస్టు 12న ముగిశాయి
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీన ముగిశాయి. డిసెంబర్ నెలలో శీతాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా.. ఈలోపే ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం కలకలం రేపుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానిపై ఒక కమిటీ వేస్తామని ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాని తర్వాత లా కమిషన్ కు ఈ విషయాన్ని నివేదించారు. లా కమిషన్ తన 79వ నివేదికలో పలు సిఫారసులు చేసింది. ఈ విషయంపై ఆచరణీయమైన రోడ్ మ్యాప్ రూపొందించాలని ప్రభుత్వం లా కమిషన్ ను కోరింది. అప్పట్లో ఈ విషయాన్ని రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగానికి ఐదు సభను చేయాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయసభల కాలపరిమితికి సంబంధించి 83వ అధికరణ, లోక్ సభ రద్దుకు సంబంధించి 85వ అధికరణ, రాష్ట్రాల శాసనసభల కాల పరిమితికి సంబంధించి 172 వ అధికరణ, రాష్ట్రాల శాసనసభల రద్దుకు సంబంధించి 174 అధికరణ, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి 356 అధికరణలను సవరించాల్సి ఉంటుంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం తప్పనిసరి. పెద్ద ఎత్తున పోలింగ్ సిబ్బంది, భద్రతా దళాల నియామకం, ఈవీఎం, వీవీ ప్యాట్ ల కోసం కొన్ని వేల కోట్ల ఖర్చు అవుతాయి. కానీ రాజ్యాంగ సవరణలకు రెండింట మూడు వంతుల వారీగా మెజారిటీ అవసరం. కాబట్టి ఈ సవరణలు ఆమోదం పొందే అవకాశం లేదని, పైగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను మెజారిటీ ప్రతిపక్షాలు తిరస్కరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లును అస్సలు ఆమోదించమని, దీనివల్ల జాతీయ పార్టీలకు ప్రయోజనం కలుగుతుందని అవి భావిస్తాయని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజ్యాంగ సవరణల ఆమోదంతో పాటు వివిధ రాష్ట్రాల ఆమోదం కూడా జమిలి ఎన్నికలకు అవసరమని గుర్తు చేస్తున్నాయి.
మహిళా బిల్లు
మహిళా రిజర్వేషన్ కూడా ఈ ప్రత్యేక సమావేశంలో మోడీ ప్రయోగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మహిళల పాత్ర కీలకంగా ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మోదీ ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధర 200 తగ్గించింది. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో కుటుంబంలోని ప్రతి మహిళా పెద్ద కు 2000 రూపాయల చొప్పున ప్రకటించింది. మధ్యప్రదేశ్ లో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళలు, బాలింతల కోసం ప్రత్యేకమైన పథకాలు అమలు చేస్తోంది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ప్రకటించి మోడీ సిక్సర్ కొట్టవచ్చని తెలుస్తోంది. గతంలో ఇదే తీరుగా త్రిబుల్ తలాక్ బిల్లుకు ఆమోదం తెలిపి మోడీ ముస్లిం మహిళల మనసు చూరగొన్నారు. అయితే మోడీ సర్కార్ ముందు అసంపూర్ణ ఏజెండాలు కూడా ఉన్నాయి. న్యాయ వ్యవస్థకు సంబంధించి మూడు కీలక బిల్లులు స్థాయి సంఘం పరిశీలనలో ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి లేకుండా చేసే మరో బిల్లు కూడా సిద్ధంగా ఉంది. ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన కూడా ఇటీవల మోడీ బిజెపి ముందు ఉంచారు. దీనిపై ఈ ఏడాది జూన్ లో లా కమిషన్ .. ప్రజలు, మత సంస్థలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు ప్రారంభించింది. అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశం తేదీలపై విపక్షాల నుంచి అభ్యంతరాల వ్యక్తం అవుతున్నాయి. హిందువులకు ముఖ్యమైన పండుగ వినాయక చవితి సందర్భంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం ఏంటని అవి ప్రశ్నిస్తున్నాయి.
