Jahnavi Kandula: తెలుగు విద్యార్థిని మృతిపై.. అమెరికన్ అధికారి హేళన
తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా అంతా భావించారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటన జరిగిన 8 నెలల అనంతరం..

Jahnavi Kandula: చాలామంది అగ్ర దేశం అమెరికా వైపు అడుగులు వేస్తుంటారు. అక్కడికి వెళ్లడం అరుదైన అవకాశం గా చెప్పుకొస్తుంటారు. కానీ అక్కడివారు మన వారిని ఎంతో చులకనగా చూస్తారు. తాజాగా అటువంటి ఘటనే అమెరికాలో వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. అక్కడి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలోని సీటల్ క్యాంపస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. కానీ ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది.
తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా అంతా భావించారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటన జరిగిన 8 నెలల అనంతరం.. జాహ్నవి రోడ్డు ప్రమాదానికి సంబంధించినవీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ పోలీస్ అధికారి జాహ్నవి మృతిని హేళన చేస్తూ మాట్లాడడం వెలుగు చూసింది.దీంతో ఆ రోడ్డు ప్రమాదానికి కారణం సదరు పోలీస్ అధికారేనని తేలింది.
ఈ ఏడాది జనవరిలో జాహ్నవి కళాశాలకు వెళ్లి వస్తుండగా.. రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి మృతి చెందింది. అయితే ఆమె మరణానికి పోలీస్ అధికారి డేనియల్ అడేరర్ కారణంగా తెలుస్తోంది. పైగా విద్యార్థిని మృతి పై అతను హేళనగా మాట్లాడాడు. మరో అధికారితో మాట్లాడే క్రమంలో.. ఆమె వయసు 26 సంవత్సరాలనే.. ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. అయితే ఆ సంభాషణ అతడు బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ సంభాషణ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై ముప్పేట విమర్శలు ఎదురు కావడంతో సీటెల్ పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది
