CM Jagan vs YS Sharmila : జగన్ చక్రం తిప్పారు.. షర్మిల పావు అయ్యారు..
నువ్వు దక్షిణాది రాష్ట్రాల్లో పని చేయాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పడం షర్మిలను ఆశ్చర్యానికి గురి చేసిందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది.

CM Jagan vs YS Sharmila : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పరస్పర అవసరాలు మాత్రమే ఉండే రాజకీయాల్లో హత్యలు కాకుండా ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. వీటిని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “జగన్మోహన్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రాజకీయ వ్యూహంలో వైయస్ షర్మిల పావుగా మారబోతున్నారు. జరిగేదేమిటో తెలిస్తే తెల్ల మొహం వేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడిది. మరి దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారు? తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేసిన షర్మిల తో కాంగ్రెస్ పార్టీ కొంతకాలంగా మంతనాలు జరుపుతోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసే బాధ్యత తీసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం షర్మిలకు ఆఫర్ ఇచ్చింది. దీనికి ప్రతిఫలంగా కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును ఇవ్వచూపింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సోదరుడైన జగన్మోహన్ రెడ్డితో నేరుగా తలపడటానికి తొలుత అంతగా సుముఖత చూపని షర్మిల.. చివరికి ఓకే అన్నారు. ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి చకచకా పావులు కదిపారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం చేశాడు. తనకున్న ధన బలంతో కీలకమైన కాంగ్రెస్ నాయకులను మేనేజ్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరి మారిపోయింది.” అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇలాంటి పరిణామాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. అలా జరిగితే ఆశ్చర్య పోవడం సగటు ఓటరు వంతు అవుతుంది. కానీ ఇలాంటివి జరగకపోతే అవి రాజకీయాలు ఎలా అవుతాయి. రాజకీయాలు అంటేనే పరస్పర అవసరాలు కదా!
జగన్ డబ్బులు ఇవ్వడంతో తన పైకి షర్మిలను ప్రయోగించకూడదని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆ పార్టీ పెద్దలు అంచనా వేసే విధంగా కొంతమంది పావులు కదిపినట్టు తెలుస్తోంది.. ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో జత కడతారని, తాను మాత్రం కాంగ్రెస్ కు అండగా ఉంటానని జగన్ హస్తం పెద్దలకు హామీ ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు బిజెపి అధినాయకత్వానికి షాక్ కలిగిస్తాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఈ తరహా రాజకీయం ఇంకా ఒంట పట్టించుకోని షర్మిల జరుగుతున్నది ఏమిటో తెలుసుకొని నిర్గాంతపోయారని కొంతమంది అంటున్నారు. మూడు రోజుల క్రితం షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఆ తర్వాత కేసి వేణుగోపాల్ వంటి నాయకులను కూడా కలిశారు. అంటే వారి మధ్య జరిగిన సంభాషణ బట్టి తెరవెనుక ఏదో జరిగిందని స్పష్టమవుతోంది. జగన్, మీ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని సోనియాగాంధీ అడిగితే, బాగోలేవని షర్మిల సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. “మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టామని అపవాదు రావడం మాకిష్టం లేదని” రాహుల్ గాంధీ అనడంతో షర్మిల ఒకింత ఆశ్చర్యపోయారని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తాను తన అన్నకు వ్యతిరేకంగా ఏపీలో పార్టీ కోసం పని చేస్తానని నిర్ణయించుకున్నప్పటికీ, అలా కాదు నువ్వు దక్షిణాది రాష్ట్రాల్లో పని చేయాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పడం షర్మిలను ఆశ్చర్యానికి గురి చేసిందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది.
వాస్తవానికి సునీల్ కనుగోలుతో షర్మిల ముందుగానే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి భిన్నంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాట్లాడారని షర్మిల సన్నిహితులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మనవాడే, ఆయన ఎంపీలు మన పార్టీకి మద్దతు ఇస్తారని వేణుగోపాల్ లాంటి వారు చెప్పడం, ఆ మాటలు విని ఆశ్చర్యపోవడం షర్మిల వంతైందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి.. అయితే నిన్నటిదాకా తనతో ఒక విధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు అనూహ్యంగా ప్లేటు ఫిరాయించడం పట్ల షర్మిల కూడా ఒకింత నిర్వేదంలో ఉన్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. జగన్ నుంచి భరోసా లభించగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలోనూ మాట మార్చినట్టు కనిపిస్తోంది. మొన్నటిదాకా నైతిక మద్దతు ఇస్తామని ప్రకటించిన వారు, ఇప్పుడు వైఎస్ సునీతా రెడ్డి విజ్ఞప్తులను కనీసం పట్టించుకోవడం మానేశారు. అయితే తన అన్న జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జాణతనంతో ఒక్కసారిగా షర్మిల ఆచేతనురాలిగా మారిపోయారని, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో పోటీ చేయకుండా ఆమెను విజయవంతంగా నిలువరించగలిగారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు జగన్ మధ్య ఒప్పందం కుదరడానికి ఎవరు కృషి చేశారో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
