Jagan vs Ramoji Rao : జగన్ ఆగేలా లేడు.. చంద్రబాబు జైలుకు.. ఇక ‘రామోజీ’ వంతు
జగన్ లండన్ నుంచి రావడమే ఆలస్యం… ఈనాడు రామోజీరావు కి, ఆయన కోడలు శైలజకు, 13 మందికి నోటీసులు పంపింది.

Jagan vs Ramoji Rao : 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తాను కట్టించిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. స్నేహ బ్లాక్ లో గంజాయి తాగి, బీడీలు పీల్చి, రకరకాల నేరాలు చేసిన నేరస్తులు ఉండే ప్రాంతంలో ఉంటున్నాడు. లక్షల్లో ఫీజు చెల్లించి లాయర్ ను పెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. లోకేష్ బాబు ప్రతిజ్ఞలు చేసినప్పటికీ, బాలకృష్ణ నోరు తిరగకున్నా ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, నారా భువనేశ్వరి కన్నీరు కార్చినప్పటికీ జగన్ కదలడం లేదు. జగన్ ను కదిలించడం లేదు. పైగా ఇదే ఊపులో జగన్ మరింత రెచ్చిపోతున్నాడు. 16 నెలల జైలు జీవితాన్ని అందించిన చంద్రబాబుపై మరింత కసితో రగిలిపోతున్నాడు. ఈ దెబ్బ సరిపోదు అనుకున్నాడెమో చంద్రబాబుకు వంత పాడుతున్న ఈనాడు రామోజీరావు పై మరోసారి కన్నెర్ర చేశాడు. స్థూలంగా చెప్పాలంటే టిడిపి ఆర్థిక మూలాలను పెకిలించి వేయడం.. అవసరం ఉంటే వాటిని సమూలంగా తొలగించడం..
చంద్రబాబు జైల్లో ఉండగానే ఏపీ సీఐడీ మార్గదర్శి కేసును మరోసారి తవ్వడం మొదలు పెట్టింది. జగన్ లండన్ నుంచి రావడమే ఆలస్యం… ఈనాడు రామోజీరావు కి, ఆయన కోడలు శైలజకు, 13 మందికి నోటీసులు పంపింది. కౌంటర్ కోసం 18 వరకు గడువు ఇచ్చింది. ఇచ్చిన నోటీసులోనూ “మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్టాల ఉల్లంఘన” ను ప్రధానంగా ప్రస్తావించింది. వీటిపై మీ సమాధానాలు ఏమిటి అని రామోజీరావు, శైలజ, ఇతర 13 మంది మార్గదర్శి అధికారులకు నోటీసులు ఇచ్చేసింది.
వాస్తవానికి ఈ కేసులో గుంటూరు విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు రిటర్న్ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిఐడి దాఖలు చేసిన అప్పీళ్ళ పై హైకోర్టు వేగంగా విచారణ జరపడం ప్రభుత్వ ఉద్దేశాన్ని చాటుతోంది. ఈ అప్పీళ్ళ పై వాదులుగా ఉన్న మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు, ఎండీ శైలజ, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్ తో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు భారీగా లబ్ధి పొందారని సిఐడి ఇప్పటికే అభియోగాలు మోపింది.. అయితే కోర్టు ఉత్తర్వులు తమ విచారణకు ప్రతి బంధకంగా మారడంతో.. సిఐడి ఈ రూట్ లో వస్తోంది.. చంద్రబాబు అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం.. ఇదే సమయంలో రామోజీరావుకి సిఐడి మళ్ళీ నోటీసులు పంపడం.. చూడబోతే టిడిపి క్యాంపుకు నిద్ర కూడా పట్టనిచ్చేలా లేడు జగన్.
అయితే మార్గదర్శి కేసును హైకోర్టు 18కి వాయిదా వేసింది.. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్టాల ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్టార్లు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజ తో పాటు మొత్తం 15 మందిపై ఐపిసి, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ ఫండ్ చట్టాల కింద సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే ఏపీ సిఐడి ప్రత్యేక కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, పట్టణంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపుగా ఒకే రకంగా ఉండడం గమనించదగిన విషయం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిఐడి హైకోర్టులో గతవారం క్రిమినల్ అప్పీళ్ళు దాఖలు చేసింది.
