Chandrababu: ఆ బ్రాండ్లకు అనుమతిచ్చింది బాబే
చంద్రబాబు అరెస్ట్ తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీలో మద్యం అవకతవకలపై గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ ఏకంగా కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు.

Chandrababu: చంద్రబాబుపై మద్యం కుంభకోణం విషయంలో జగన్ సర్కార్ పట్టు బిగిస్తోంది. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు సర్కార్ అవినీతిని ఎండగట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలకు చెందిన కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేశారనేది జగన్ సర్కార్ చేస్తున్న అభియోగం. దీనివల్ల ఖజానాకు యాట 1300 కోట్ల రూపాయల నష్టం సంభవించిందని వైసిపి ఆరోపిస్తోంది. ఇప్పటికే దీనిపై ఏపీ బేవరేజెస్ కంపెనీ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేశారు. సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబును ఏ3గా చూపింది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీలో మద్యం అవకతవకలపై గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ ఏకంగా కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు జగన్ హయాంలో నాసిరకం మద్యం బ్రాండ్లు వచ్చాయని.. జే టాక్స్ తో దోచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. మద్యం విషయంలో జగనన్న బ్రాండ్లతో ప్రజారోగ్యానికి విగాతం కలిగిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఒక్క మద్యం విషయంలోనే జగన్ సర్కార్ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు హయాంలో మద్యం విధానం పై లోతైన అధ్యయనం చేసిన జగన్ సర్కార్.. ఎన్నికల ముంగిట అదో ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని భావిస్తుంది.
ఇప్పటికే మద్యం కుంభకోణం విషయంలో సిఐడి ఏసీబీ కోర్టులో నివేదిక ఇచ్చింది. విచారణ కూడా ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడంతో.. అప్పటివరకు తమకు అరెస్టు చేసే ఉద్దేశం లేదని సిఐడి చెప్పుకొస్తోంది. అయితే చంద్రబాబు హయాంలో మద్యం పాలసీ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై లోతైన అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా మద్యం బ్రాండ్ల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాలన్న ప్రయత్నంలో ఉంది.
దేశంలో కనివిని ఎరుగని మద్యం బ్రాండ్లు ఏపీలో కనిపిస్తున్నాయి. అవన్నీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చినవేనని.. కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా కంపెనీలకు అనుమతులు ఇచ్చారని విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తూ వచ్చాయి. కానీ ఇలా ఇచ్చిన అనుమతులు మా హయాంలో కాదని.. చంద్రబాబు సర్కారే ఈ కంపెనీలకు అనుమతి ఇచ్చిందని.. అప్పట్లో డిస్టర్లరీలు నడిపిన టిడిపి నాయకులు చాలామంది వాటిని విక్రయించారని.. అప్పట్లోనే నాసిరకం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని జగన్ సర్కార్ ప్రచారం ప్రారంభించింది. ఏ కంపెనీకి ఎప్పుడు అనుమతి ఇచ్చింది కూడా స్పష్టం చేస్తూ సాక్షిలో సమగ్ర కథనాలు ప్రచురిస్తోంది. ఒకవైపు చంద్రబాబుపై న్యాయపోరాటం చేస్తూనే.. తమ సర్కార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలన్న భావనతో జగన్ ఉండడం విశేషం. అయితే ఈపాటికి మద్యం విషయంలో జగన్ ప్రభుత్వం పై ఒక ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దానిని ఎలా తిప్పి కొడతారో చూడాలి.
