CM Jagan: ఏపీ సర్కారు చర్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని దుస్థితి. పూటకో ఉత్తర్వు, జీవోతో జగన్ సర్కారు అన్ని శాఖలను దడపుట్టిస్తోంది. అయితే వాటికి ప్రజా వ్యతిరేకత ఎదురయ్యేసరికి వెనక్కి తీసుకుంటోంది. ఇంతలో ఎన్నిరకాలుగా నష్టం జరగాలో అంతలా జరిగిపోతుంది. ప్రభుత్వం కూడా ఆదాయం కోల్పోతోంది. అయితే అటువంటి జీవోలు ఒకటి, రెండు అయితే చెప్పగలం కానీ.. వందలు ఉన్నాయి. జీవోల వల్ల బాధితులుగా మారుతున్న వారు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందుతుండగా.. ప్రజల నుంచి వస్తున్న ప్రతికూలత గమనించి ప్రభుత్వమే కొన్ని జీవోలను వెనక్కి తీసుకోవడమో.. రద్దు చేయడమో చేస్తోంది. తాజాగా జగన్ సర్కారు 145 జీవోను వెనక్కి తీసుకోనున్నట్టు ప్రకటించింది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గే జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

CM Jagan
2021 డిసెంబరు 6న జగన్ సర్కారు 145 జీవో జారీచేసింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే లేఅవుట్లలో 5 శాతం నిరుపేదలకు కేటాయించాలన్నదే ఈ జీవో సారాంశం. అయితే దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు విముఖత చూపారు. వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇలా అయితే వ్యాపారం చేయలేమని వారు భావించారు. ఈ జీవో జారీ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వానికి ఆదాయం కూడా పడిపోయింది. వ్యాపారం కోసం తాము లేఅవుట్లు వేస్తుంటే.. 5 శాతం పేదలకు కేటాయించాలని కోరడం ఏమిటని రియల్టర్ల నుంచి నిలదీతలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ లేఅవుట్లు వేస్తున్న వారు ఆ భారాన్ని మిగతా కొనుగోలుదారులపై వేస్తుండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది.

CM Jagan
అయితే ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పోయేదేమీలేదని.. ఆ భారాన్ని కొనుగోలుదారులతో పూడ్చుకోవడంతో అంతిమంగా భారం సొంతింటి కోసం పరితపించే వారిపై పడుతుందన్న కామెంట్స్ వినిపించాయి. ప్రజల్లోకి ఇది బలంగా వెళుతుండడంతో పాటు ఇంటి స్థలాల ధర పెరుగుదలకు ప్రభుత్వమే కారణమన్న భావన అంతటా వ్యాపించింది. అర్థం పర్థం లేని జీవోలు తెచ్చి ప్రభుత్వం ఇబ్బందిపెడుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికితోడు 145 జీవోను రద్దు చేయాలని కోరుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది, జీవొను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. మున్సిపల్ శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది.