Jagan vs Pawan Kalyan: జగన్, పవన్.. మధ్యలో బీజేపీ.. ప్లాన్ అదే
చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు శరవేగంగా మారాయి. చంద్రబాబు ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుందనే దానిపై ఎవరికి స్పష్టత లేదు. లోకేష్ సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

Jagan vs Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో తాజా పరిస్థితులకు బిజెపి కారణమా? కేంద్ర పెద్దల పక్కా ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారా? అందులో భాగమే చంద్రబాబు అరెస్టా? త్వరలో లోకేష్ ను సైతం అరెస్టు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా బిజెపి వ్యవహార శైలి.. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న రాజకీయం చూస్తే తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో టిడిపిని బలి పశువు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ ద్వారా చంద్రబాబును అణచివేసి.. పవన్ ద్వారా ఏపీ పై పట్టు సాధించాలని బిజెపి భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతున్నా పవన్ కు ఇంతవరకు అధికారం దక్కలేదు. 2014 ఎన్నికల సమయంలో జనసేన ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు . కాపు ఓటు బ్యాంక్ టిడిపి వైపు టర్నయ్యేందుకు పవన్ ఎంతగానో దోహదపడ్డారు. 2019 ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో కలిసి నడిచారు. కేవలం ఆరు శాతం ఓట్లను మాత్రమే దక్కించుకున్నారు. అయితే పార్టీ పెట్టిన ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా దక్కించుకున్నది ఏమీ లేదు. ప్రత్యర్థుల విమర్శలను మాత్రం భరించాల్సి వచ్చింది. అయితే తన చుట్టూ జరుగుతున్న వివాదాలు,కుట్రలను పవన్ ఛేదించుకొని ముందుకు సాగారు. ఆ పరిణామాల క్రమంలో పవన్ రాటుదేలారు. దీంతో ఏపీ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను పెంచుకున్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు శరవేగంగా మారాయి. చంద్రబాబు ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుందనే దానిపై ఎవరికి స్పష్టత లేదు. లోకేష్ సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ వేగంగా స్పందించారు. నేరుగా జైలుకెళ్లి పరామర్శించారు. తిరిగివచ్చి పొత్తు ప్రకటన చేశారు. దీంతో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు టిడిపి, జనసేన పొత్తు కుదిరితే పవన్ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలని విషయంలో బేరాలు ఆడే స్థితిలో టిడిపి ఉండేది. కానీ తాజా పరిస్థితులతో తమ పార్టీకి ఎన్ని సీట్లు? ఎక్కడ కావాలో? డిమాండ్ చేసే పరిస్థితికి పవన్ చేరుకున్నారు. ఒకవేళ లోకేష్ సైతం అరెస్టు అయితే.. టిడిపి, జనసేన కూటమి నాయకత్వ బాధ్యతలను పవన్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది అనివార్యం కూడా.
అయితే పవన్ దూకుడు వెనుక బిజెపి ఉందా అన్న అనుమానం ఒకటి వ్యక్తం అవుతుంది. గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బిజెపి పాత్రను కచ్చితంగా సందేహించాల్సిందే. ఒకవైపు జగన్కు ప్రోత్సాహం అందిస్తూనే.. మరోవైపు పవన్ ద్వారా పావులు కదుపుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. వీలైనంతవరకూ తెలుగుదేశం పార్టీని కట్టడి చేసి.. అచేతనం చేసి.. కావలసినన్ని సీట్లు సాధించేందుకే.. కేంద్ర పెద్దలు చంద్రబాబు అరెస్ట్ కు ప్లాన్ చేశారన్న టాక్ నడుస్తోంది. అయితే ఇటువంటి రాజకీయాలకు పవన్ ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే నేరుగా కాకుండా అటు జగన్ నుంచి నరుక్కుని వచ్చారు. జగన్ ద్వారా చంద్రబాబును అరెస్టు చేయించి.. పవన్ కు ఫ్రీ హ్యాండ్ వదిలి పక్కా ప్లాన్ తోనే ఈ ఎపిసోడ్ ను నడిపినట్లు వార్తలు వస్తున్నాయి.
