CM Jagan: టిడిపి కళ్ళల్లో ఆనందం చూస్తున్న జగన్
ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండగా చంద్రబాబును అరెస్టు చేయడం జగన్కు సాహసంతో కూడుకున్న పనే. ఈ విషయంలో చాలామంది సన్నిహితులు సైతం హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

CM Jagan: చంద్రబాబు అరెస్టుతో టిడిపి బలహీనం అయ్యిందా? అలా భావించే జగన్ కేసులతో అరెస్టు చేయించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చి నడుస్తోంది. అదే భావనతో అరెస్టు చేసి ఉంటే మాత్రం.. జగన్ ఆశించినది జరగలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 53 రోజులు జైల్లో పెట్టినంతమాత్రాన చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించారని అంతా భావించారు. కానీ చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి నీరుగారిపోయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉరకలెత్తిన ఉత్సాహంతో అధినేతకు స్వాగతం పలికారు. మొన్నటి వరకు అయోమయంలో ఉన్నవారు సైతం రోడ్డుపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడో మూలన ఉన్న టిడిపి శ్రేణులను రోడ్డుపైకి తెచ్చిన ఘనత మాత్రం జగన్ దేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండగా చంద్రబాబును అరెస్టు చేయడం జగన్కు సాహసంతో కూడుకున్న పనే. ఈ విషయంలో చాలామంది సన్నిహితులు సైతం హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే మనసు నిండా పగ, ప్రతీకారంతో నిండిపోయిన జగన్ తన చర్యలను సమర్థించుకున్నారు. చంద్రబాబుపై కేసుల విషయంలో దూకుడుగా వ్యవహరించారు. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో రాజకీయాల్లో లాభనష్టాలను లెక్క వేసుకోకుండా జగన్ ఈ చర్యలకు దిగినట్లు అర్థమవుతోంది. కేవలం వ్యక్తిగత టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వైసిపి వర్గాలు మాత్రం తాము ఏదో రాజకీయ ఆధిపత్యం కొనసాగించామని భావించారు. కానీ చంద్రబాబు అరెస్ట్, బెయిల్ తదనంతర పరిణామాలతో వైసీపీలో క్రియాశీల రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక్కడ జగన్ తన గొయ్యి తాను తవ్వుకున్నారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. అందుకే క్యాబినెట్లో సీనియర్లు సైతం చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాట్లాడేందుకు వెనుకడుగు వేశారు.
చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ తొందరపాటు చర్యకు పాల్పడ్డారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయనకు తెలంగాణలో ఉన్న సన్నిహితులు సైతం ఇది తప్పుడు మార్గమని తేల్చేశారు. చంద్రబాబు విషయంలో జగన్ రెండు రకాల ఆలోచనలు చేశారు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని చంద్రబాబును నేను జైల్లో పెట్టించానని అహం ఒకవైపు.. తెలుగుదేశం పార్టీని దారుణంగా బలహీనపరిచానని ఇంకోవైపు ఆనందపడ్డారు. కానీ చంద్రబాబు రిలీజ్ అయిన తర్వాత పరిస్థితులను చూసి తన తప్పిదాన్ని తెలుసుకున్నారు.
ఇన్ని రోజులు పాటు చంద్రబాబును జైలులో పెట్టామన్న ఆనందం కంటే.. ఆయనకు బెయిల్ లభించడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. మరో ఆరు నెలల పాటు జైలులో ఉంచుతామని భ్రమ పడ్డవారు.. తమ ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో కలవరపాటుకు గురవుతున్నారు. చంద్రబాబుకు వచ్చింది మధ్యంతర బెయిలా.. మెడికల్ గ్రౌండ్ మీద వచ్చిందా? అన్నది టిడిపి శ్రేణులు, అభిమానులు చూడలేదు. ఆయన బయటకు వచ్చిన మరుక్షణం.. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. టిడిపిలో రెట్టింపు పైన ఈ ఉత్సాహం వెనుక ఉన్నది మాత్రం ముమ్మాటికీ జగనే.
అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సంబరాలు వ్యక్తం కాగా… ఎందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ప్రజాస్పందన వస్తుందని గమనించని సజ్జల లాంటివాళ్ళు వక్ర భాష్యం చెప్పడం ప్రారంభించారు. ర్యాలీలు చేస్తారా? అంటూ ఏకంగా సిఐడితో కోర్టులో పిటిషన్ వేయించారు. అధినేత వస్తున్నాడని తెలిసి అర్ధరాత్రి వరకు టిడిపి శ్రేణులు రహదారులపై ఉండడం సహజం. కానీ దానిని ప్రసారమాధ్యమాల్లో చూస్తున్న వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ చర్యలను తప్పు పట్టడం ప్రారంభించారు. ఎన్నికల ముంగిట ఇది అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తనకు తాను తవ్వుకోవడమేనని భావిస్తున్నారు.
