CM Jagan: విపక్షాల మధ్య ఐక్యత పెంచుతున్న జగన్
ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన మధ్య పొత్తుల వాతావరణం నడుస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి అగ్రనేతల వైఖరి తెలియకున్నా.. ఇటీవలే రాష్ట్ర పగ్గాలు అందుకున్న పురందేశ్వరి టిడిపి విషయంలో సానుకూలంగా ఉన్నారు.

CM Jagan: ఏపీలో విపక్షాల మధ్య సానుకూల వాతావరణానికి జగన్ కారణం అవుతున్నారు. వారందరినీ ఒకే తాటిపైకి తీసుకు వస్తున్నారన్న టాక్ నడుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో సిఐడి అత్యుత్సాహంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అరెస్టు సరే.. అరెస్టు చేసిన తీరు సరికాదంటూ ఎక్కువమంది తప్పు పడుతున్నారు. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా జనం మధ్యనే చంద్రబాబును అరెస్టు చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు చంద్రబాబు అరెస్టును బిజెపి, జనసేన, వామపక్షాలు ఖండించాయి.
ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన మధ్య పొత్తుల వాతావరణం నడుస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి అగ్రనేతల వైఖరి తెలియకున్నా.. ఇటీవలే రాష్ట్ర పగ్గాలు అందుకున్న పురందేశ్వరి టిడిపి విషయంలో సానుకూలంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు అయిన వెంటనే ఆమె స్పందించారు. సరైన నోటీసు ఇవ్వకుండా.. ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా.. వివరణ తీసుకోకుండా.. ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని పురందేశ్వరి ట్విట్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ సైతం ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్థరాత్రి అరెస్టు చేసే విధానాన్ని ఏపీలో అవలంబిస్తున్నారని.. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులు అయితే.. వైసీపీకి ఏం సంబంధం అని పవన్ ప్రశ్నించారు. టిడిపి శ్రేణులను అణచి వేయడాన్ని సైతం తప్పుపట్టారు. అటు వామపక్ష నాయకులు సైతం అక్రమ అరెస్టును ఖండించారు.
అయితే ఇంతవరకు కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు. కానీ బిజెపి రాష్ట్ర నాయకత్వం మాత్రం చంద్రబాబు అరెస్ట్ తీరును తప్పు పట్టడం విశేషం. అటు జనసేన సైతం హుటాహుటిన స్పందించడం గుర్తించాల్సిన అంశం. ఈ ఘటన పొలిటికల్ గా హీట్ పెంచుతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ సంచలనంగా మారనుంది. అదే సమయంలో విపక్షాల మధ్య ఐక్యతకు కారణమవుతోంది. ఇదే పొలిటికల్ హీట్ లో చంద్రబాబు పొత్తుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
