CM Jagan: వాళ్ల కోరికలన్నీ తీరుస్తున్న జగన్
CM Jagan: అధికార వైసీపీలో ఎమ్మెల్యేలంటే ఉత్సవ విగ్రహాలన్న పేరుంది. 151 మంది ఎమ్మెల్యేలున్నా.. వారి కంటే వంద మంది ఉండే ఐ ప్యాక్ బృందానికే జగన్ ప్రాధాన్యత ఇస్తారన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యేలు నిమిత్తమాత్రులని.. ప్రజలు తన ఫొటోను చూసి ఓటు వేస్తారని జగన్ భావిస్తున్నట్టు విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు అదే ఎమ్మెల్యేలపై జగన్ ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో వారు అడిగిన కోరికలన్నీ తీర్చుతున్నారు. వారికి దాదాపు ప్రాధేయపడినట్టు […]


CM Jagan
CM Jagan: అధికార వైసీపీలో ఎమ్మెల్యేలంటే ఉత్సవ విగ్రహాలన్న పేరుంది. 151 మంది ఎమ్మెల్యేలున్నా.. వారి కంటే వంద మంది ఉండే ఐ ప్యాక్ బృందానికే జగన్ ప్రాధాన్యత ఇస్తారన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యేలు నిమిత్తమాత్రులని.. ప్రజలు తన ఫొటోను చూసి ఓటు వేస్తారని జగన్ భావిస్తున్నట్టు విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు అదే ఎమ్మెల్యేలపై జగన్ ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో వారు అడిగిన కోరికలన్నీ తీర్చుతున్నారు. వారికి దాదాపు ప్రాధేయపడినట్టు వ్యవహరిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే అటు మారితే..ఫలితమే తారుమారయ్యే అవకాశముండడమే జగన్ ప్రేమకు కారణం.
ఈ మార్పునకు అదే కారణం…
మరో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని జగన్ గంటాపధంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో అంతులేని విజయం దక్కించుకున్నా ఆయనకు అధికార దాహం తీరనట్టు లేదు. ఎన్నిక ఏదైనా, ఎలాంటిదైనా గెలుపుబాట పట్టాలని గట్టి ప్రయత్నమే చేస్తూ వచ్చారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు..ఇలా ఏదైనా వైసీపీకి ఏకపక్ష విజయమే. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఫస్ట్ టైమ్ ప్రతికూలత ఎదురైంది. రాష్ట్రంలో తనకు అనుకూలంగా భావిస్తున్న రెండు ప్రాంతాల్లో ఓటమే ఎదురైంది. దీంతో ఇంటా బయటా ముప్పేట ఒత్తిడి ఎదురవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యేల కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. మూడు పట్టభద్రుల స్థానాలు చేతికి చిక్కేసరికి చంద్రబాబు పట్టు బిగిస్తున్నారు.
కొద్దిసేపట్లో పోలింగ్…
ఎమ్మెల్యేల కోటా కింద ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మరికొద్ది సేపట్లో పోలింగ్ జరగనుంది. ఏడు స్థానాలకూ వైసీపీ పోటీ పెట్టింది. అంతా ఏకగ్రీవమవుతాయని భావించింది. కానీ టీడీపీ అనూహ్యంగా బీసీ మహిళా నేత పంచుమర్తి అనురాధను బరిలో దించింది. దీంతో పోటీ అనివార్యంగా మారింది. ప్రస్తుతం వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేనకు చెందిన రాపాక, టీడీపీకి చెందిన కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు అధికార పార్టీ నీడన చేరారు. దీంతో అధికార వైసీపీ బలం 156కు చేరింది. కానీ ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ధిక్కార స్వరం వినిపించారు. పార్టీకి దూరమయ్యారు. వైసీపీ కూడా దూరం చేసింది. దీంతో వైసీపీ బలం 154. అదే సమయంలో ఇద్దరు వైసీపీ రెబల్స్ టీడీపీ గూటికి చేరితే మాత్రం ఆ పార్టీ బలం 21కు చేరుతుంది. ఇంకా ఒక్క ఎమ్మెల్యే కానీ టీడీపీకి చిక్కితే ఆ పార్టీ అభ్యర్థి అనురాధ ఎమ్మెల్సీ కావడం ఖాయం. అదే జరిగితే వైసీపీ నుంచి బరిలో దిగిన ఒకరు ఓడిపోవడం తప్పనిసరి.
ఆత్మరక్షణలో వైసీపీ..
అయితే ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీ ఆత్మరక్షణలో పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు కలవరపెడుతున్నాయి. తమకు నలుగురు దూరమైనా వైసీపీ లో ఇప్పటికే ఇద్దరు రెబల్స్ తమకు అనుకూలంగా ఓటింగ్ చేస్తారని టీడీపీ విశ్వసిస్తోంది. ఇప్పటికే ఆ ఇద్దరిని వైసీపీ తమ లెక్క నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. ఆనం..కోటంరెడ్డి తమ ఆత్మప్రభోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థికి ఆ ఇద్దరూ ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే టీడీపీ టచ్ లోకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేల అభిమానాన్ని చూరగొనేందుకు జగన్ ప్రయత్నిస్తుండడం విశేషం. వారు అడిగినన్ని కోరికలు తీరుస్తున్నారు.క్యాంపు రాజకీయాలతో విందులు, వినోదాలతో వారిని ఆనందింపజేయాల్సి వస్తోంది.

CM Jagan
స్వయంకృతాపం…
అయితే ఈ పరిస్థితికి జగన్ ముమ్మాటికీ కారణం. ఎందుకంటే ఎమ్మెల్యేలను ఆయన పెద్దగా విశ్వసించలేదు. కిందిస్థాయిలో వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ గెలిపిస్తుందని నమ్మారు. ఐ ప్యాక్ టీమ్ వ్యూహాలే గట్టెక్కిస్తాయని భావించారు. సంక్షేమ తారకమంత్రంతో మరోసారి అధికారంలోకి వస్తానని ధీమాగా ఉన్నారు. తన ఫొటోతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. బాగా పనిచేయపోతే మార్చేస్తానని కూడా హెచ్చరించారు. విధులు, నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో వారు పక్కచూపులు చూడడం ప్రారంభించారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడం, విపక్షాలు దూకుడుగా ఉండడంతో చాలామంది పునరాలోచనలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో సహజంగానే అధికార పార్టీకి ప్రతికూలాంశంగా మారింది. అందుకే ఎన్నడూ లేనంతగా జగన్ హైరానా పడాల్సి వస్తోంది.