Chandrababu IT Notices: చంద్రబాబుకు ఐటీ నోటీసులు.. అంతా గప్ చుప్
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. సచివాలయ భవనం, హైకోర్టు భవన నిర్మాణంలో చాలా సంస్థలు పాలుపంచుకున్నాయి.

Chandrababu IT Notices: కాదేది వార్తకు అనర్హం అన్న రోజులివి. వింతలు, విశేషాలు, వైరల్ విషయాలు.. ఇలా అన్నింటికీ మీడియా అత్యంత ప్రాధాన్యమిస్తోంది. లేకుంటే టీఆర్పిల్లో, వ్యూయర్ షిప్పుల్లో వెనుకబడిపోయిన రోజులివి. అందుకే ఏ చిన్న పాయింట్ని సైతం మీడియా విడిచిపెట్టడం లేదు. కానీ ఇటువంటి సమయంలోనే మాజీ సీఎం చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగు మీడియా లైట్ తీసుకోవడం విశేషం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. కానీ దీనికి తెలుగు మీడియా నిమ్మకు నీరెత్తన్నట్లుగా వ్యవహరించడం విశేషం.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. సచివాలయ భవనం, హైకోర్టు భవన నిర్మాణంలో చాలా సంస్థలు పాలుపంచుకున్నాయి. సబ్ కాంట్రాక్ట్ పొందిన చాలా కంపెనీల నుంచి చంద్రబాబు సర్కార్ ముడుపులు పొందినట్లు వార్తలు వచ్చాయి.అందుకు తగ్గట్టుగా సదరు కంపెనీ సంస్థల ప్రతినిధుల కార్యాలయాల్లో తనిఖీ సమయంలో ఇందుకు సంబంధించి మూలాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు అనుగుణంగా ఆదాయ పన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు అందించినట్లు నేషనల్ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలపై ఆదాయ పన్ను శాఖ సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇంతటి ప్రాధాన్యత వార్తను తెలుగు మీడియా లైట్ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పదుల సంఖ్యలో మీడియా ఛానళ్లు, పత్రికలు ఉన్నా ఒక్క సాక్షి పత్రికలో మాత్రమే ఈ వార్తకు ప్రాధాన్యం లభించింది. సాక్షి పై పార్టీ పత్రిక అన్న అపవాదు ఉన్న నేపథ్యంలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వార్త వచ్చిన అది ప్రాధాన్యం తగ్గ విషయం కాదు. కానీ మిగతా మీడియాలో కనీసం చిన్నపాటి వార్త కూడా రాకపోవడం విస్తు గొల్పుతోంది.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్న పేరు ఉంది. అందుకు తగ్గట్టుగానే నేరుగా ఆయన ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చినా తెలుగు మీడియా గుప్ చప్ గా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
