
IT Layoffs 2023
IT Layoffs 2023: ఐదు అంకెల జీతం.. విలాసవంతమైన జీవితం.. వీకెండ్ పార్టీలు.. ఇయర్ ఎండింగ్ మస్తీలు.. అమెరికా కొలువు గురించి.. అక్కడి జీవితం గురించి చెప్పాలంటే ఈ ఉపమానాలు సరిపోవు. అందుకే మనవాళ్లు అమెరికా వెళ్లేందుకు ఎక్కడా లేని ఉత్సాహం చూపిస్తుంటారు. అక్కడ పని చేయాలని, నాలుగు రాళ్లు వెనకేయాలని తహతహలాడుతుంటారు.. కానీ దూరపు కొండలు నునుపు అనే సామెత లాగా.. ఇప్పుడు అమెరికాలో కొలువులు కూలిపోతున్నాయి. అమెరికానే నమ్ముకున్న వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి.
ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న కంపెనీల దాకా ఉద్యోగులను ఉన్నపలంగా బయటకు పంపించాయి. ఇందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. దీంతో వారు పరాయి దేశంలో కొలువు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా చట్టాల ప్రకారం హెచ్1 బీ వీసా మీద ఉన్నవారు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలి. అయితే ఉద్యోగం కోల్పోయిన చాలామంది అమెరికాను విడిచి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అలాగని వారికి కొత్త ఉద్యోగం దొరకడం లేదు. ఫలితంగా వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక కొందరైతే కుటుంబాలతో సహా అమెరికాను వీడి తిరిగి స్వదేశానికి వస్తున్నారు. అయితే ఈ పరిణామాన్ని అమెరికా టెక్ నిపుణులు భారీ మానవ సంక్షోభంగా అభివర్ణిస్తున్నారు. ఇది కుటుంబ సభ్యులపైనే కాదు.. అమెరికాలో పుట్టిన పిల్లలపై కూడా పడనుంది. వారు కూడా తమ తల్లిదండ్రులతో అర్ధాంతరంగా దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆరంభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అమెరికా మీడియా చెబుతోంది.. ఇక ఈ తరహా కేసులను ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయా స్పోరా స్టడీస్ చట్టసభల ముందు ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. ప్రస్తుతం 60 రోజల గడువు కారణంగా వేలమంది సాఫ్ట్వేర్ నిపుణులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధ్యక్ష ఉపసలహా సంఘం ఇటీవల గ్రేస్ పీరియడ్ ను 60 రోజుల నుంచి ఆరు నెలలకు పెంచాలని సూచించింది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు కొత్త కొలువు వెతుక్కునేందుకు తగిన సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. క్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు వెసులుబాటు లభ్యమవుతుందని వివరించింది. ఇది అమలులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అమెరికన్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కొత్త విధానాన్ని తక్షణమే తీసుకురావాలని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా కోరుతోంది. నూతన సిఫారసు కు వైట్ హౌస్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తొందరగా అమల్లోకి వచ్చిన గత ఏడాది అక్టోబర్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.

IT Layoffs 2023
గత ఏడాది నుంచి రెండు లక్షల 50 వేల మంది హెచ్ 1 బీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. మెటా లాంటి పెద్ద సాంకేతిక సంస్థలు ఉద్యోగులపై భారీగా వేటు వేస్తుండటంతో ఈ సంఖ్య భారీగా పెరుగుతోంది. వీరంతా అమెరికా దేశ అభివృద్ధికి పన్ను చెల్లిస్తున్న హెచ్ 1 బీ వీసా పలుసుదారులే.. ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉండడం గమనార్హం. తమ తరఫున మరో సంస్థ హెచ్ 1 బికి దరఖాస్తు చేయకపోతే మీరంతా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే గనక అమెరికా చరిత్రలో ఈ పరిణామం భారీ మానవ సంక్షోభంగా మిగిలిపోతుంది..