Rajinikanth On Chandrababu: చంద్రబాబును కలవాలనుకున్నది నిజమే.. ఎట్టకేలకు స్పందించిన రజనీకాంత్
రజినీకాంత్, చంద్రబాబు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రజనీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు. అందుకే చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించడంతో.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు.

Rajinikanth On Chandrababu: చంద్రబాబును రజినీకాంత్ కలవాలనుకున్నారా? రాజమండ్రి జైలులో ములాఖత్ కావాలని భావించారా? గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ ఇదంతా ఫేక్ అని టాక్ నడిచింది. అయితే అసలు విషయాన్ని రజినీకాంత్ స్వయంగా ప్రకటించారు. ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. నేరుగా లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ధైర్యం చెప్పారు.
రజినీకాంత్, చంద్రబాబు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రజనీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు. అందుకే చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించడంతో.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. చంద్రబాబు గురించి గొప్పగా మాట్లాడారు. దీంతో వైసీపీ నాయకుల ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి రజనీకాంత్ సైతం తనదైన రీతిలో స్పందించారు. ఓ సినిమా వేడుకలో మొరగని కుక్క ఉండదంటూ కామెంట్స్ చేశారు. ఇవి తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో రజనీకాంత్ స్పందించారు. కానీ సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి పోస్టులు పెట్టలేదు. నేరుగా లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. దీనిపై మీడియాలో పతాక శీర్షికన వార్తలు రావడంతో వైసిపి సోషల్ మీడియా మరోలా ప్రచారం చేసింది. వైసీపీ నేతలకు భయపడి రజనీకాంత్ స్పందించి ఉండరని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సమయంలో తలెత్తిన వివాదంతో రజనీకాంత్ వెనక్కి తగ్గారని కూడా విశ్లేషించింది. నేరుగా రాజమండ్రి వచ్చి చంద్రబాబును కలుస్తారన్న ప్రచారం కూడా ఫేక్ గా తేల్చింది.
అయితే తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై రజినీకాంత్ నేరుగా స్పందించారు. చంద్రబాబును జైల్లో ములాఖత్ అవ్వాలని భావించినట్లు ధృవీకరించారు. అయితే కుటుంబ కార్యక్రమం కోసం కోయంబత్తూర్ వెళ్తున్నందున కలవలేకపోయానని చెప్పుకొచ్చారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో రజనీకాంత్ స్వయంగా ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరని.. ఆయన చేసిన అభివృద్ధి, మంచి పనులు, మంచితనమే ఆయనకు రక్షగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో వైసిపి సోషల్ మీడియా ఫేక్ ప్రచారం తేలిపోయింది. అయితే తాజాగా రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ స్థాయిలో స్పందిస్తారో చూడాలి.
