CM KCR: పిల్లిని గదిలో పెట్టి కొడితే పులి అవుతుంది. ప్రాణాలకు తెగించి ప్రతిదాడి చేస్తుంది. తెలంగాణలో కూడా ప్రస్తుతం విపక్షాలు ఇదే చేస్తున్నాయి. ఇంతకాలం ప్రభుత్వం పెట్టిన కేసులు, నిర్బంధాలకు భయపడిన విపక్ష నేతలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేయడానికి కూడా వెనుకాడారు. మరో పది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్బంధాలను ఛేదిస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్‌నే అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల పర్యటనల్లో నిరసలతో సెగలు పుట్టిస్తున్నారు.. గులాబీ బాస్‌కు చెమటలు పట్టిస్తున్నారు.

CM KCR
ముందస్తు అరెస్టులు..
తెలంగాణలో ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి పర్యటిస్తున్నారంటే పోలీసులు అప్రమత్తమవుతారు. వారు పర్యటించే జిల్లాల్లో విపక్ష నేతలను ముందస్తుగానే అరెస్ట్ చేస్తారు. గృహనిర్బంధం చేస్తారు. ఇది గత నాలుగేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఆదేశిస్తారో.. లేక పోలీస్ బాస్ నుంచి ఆదేశాలు వస్తాయో తెలియదు కానీ.. విపక్ష నేతలు శాంతియుత నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. నిర్బంధాలనూ విపక్షాలు ఛేదిస్తున్నాయి.
పాలమూరులో బీజేవైఎం నిరసన..
ఇటీవల సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాలో పర్యటించారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సభ నిర్వహణకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు యథావిధిగా విపక్ష నేతలను అదుపులోకి తీససుకున్నారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కానీ, బీజేవైఎం కార్యకర్తలు నిర్బంధాన్ని ఛేదించుకుని సీఎం కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
జగిత్యాలలో ఫ్లెక్సీకి నిప్పు..
ఇక బుధవారం సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో గులాబీ నేతలు జగిత్యాల పట్టణమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. మంగళవారం రాత్రే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పట్టణంలోని మార్కండేయ టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు టీఆర్‌ఎస్ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో దానిని తొలగించాలని ముందుగానే చెప్పారు. అయినా తొలగించలేదు. దీంతో పట్టణానికి చెందిన ఓ యువకుడు తెలంగాణ జాతిపిత అయిన లక్ష్మణ్ బాపూజీ ని అవమాన పరుస్తారా అంటూ ఆ ఫ్లెక్సీకి నిప్పు పెట్టాడు. అంతేకాకుండా ఆ స్థలంలో ఎవరు ప్లెక్సీ పెట్టినా నిప్పు పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విద్యాసంస్థలు బంద్‌పై పెరెంట్స్ ఆగ్రహం..
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలు, కళాశాలల యాజమాన్యాలు సెల్ఫ్ హాలిడే ప్రకటించుకున్నాయి. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం విద్యాసంస్థలను మూసివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులన్నీ సీఎం సభకు జన సమీకరణ కోసం పంపించాలని అధికారుల నుంచి∙వచ్చిన ఒత్తిడి వల్లనే పాఠశాలలు, కళాశాలలకు సెల్ఫ్ హాలిడే డిక్లేర్ చేశామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితి లేదని, తెలంగాణలో మాత్రమే ఇలా హాలిడేలు ఇస్తున్నారని పెరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CM KCR
నిరసనలకు కాంగ్రెస్ పిలుపు..
మరోవైపు కేసీఆర్ పర్యటనలో నిరసన తెలుపాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. జిల్లాకు కేసీఆర్‌పలు హామీలు ఇచ్చి మరిచాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. హామీలు నెరవేర్చకుండా జిల్లాకు వస్తున్న కేసీఆర్‌కు అడుగడుగునా నిరసన తెలపాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను విస్మరించినందున సీఎం సభలో నిరసన వ్యక్తం చేయాలన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. బ్రాహ్మణ సంఘం నాయకులు, భక్తులు రాజకీయంగా కాకుండా స్వామివారి భక్తులుగా రాజన్న ఆలయ అభివృద్ధిపై నిలదీయాలన్నారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదని, అడిగితే అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
మొత్తంగా ప్రభుత్వం ఏం చేసినా పెద్దగా పట్టించుకోని విపక్షాలు ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ కాన్వాయ్‌నే అడ్డుకునే ప్రయత్నం చేయడం, నిరసనలకు పిలుపునివ్వడం గమనార్హం.