TSPSC paper leakage : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ: నేరం నిరూపితమైనా నిందితులకు శిక్ష పడదు
TSPSC paper leakage : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. నిందితులు కంప్యూటర్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని తస్కరించారని నిరూపితమైనా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) మొదట్లో భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి సమాచార సాంకేతి(ఐటీ) చట్టా న్ని ప్రయోగిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ను ఆల్టర్ చేసింది. ఇదొక్కటే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు సంబంధించిన సింహభాగం కేసులను ఐపీసీ కిందే నమోదు చేస్తున్నారు. ఫలితంగా.. […]

TSPSC paper leakage : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. నిందితులు కంప్యూటర్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని తస్కరించారని నిరూపితమైనా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) మొదట్లో భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి సమాచార సాంకేతి(ఐటీ) చట్టా న్ని ప్రయోగిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ను ఆల్టర్ చేసింది. ఇదొక్కటే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు సంబంధించిన సింహభాగం కేసులను ఐపీసీ కిందే నమోదు చేస్తున్నారు. ఫలితంగా.. చార్జిషీట్లు కోర్టుల్లో వీగిపోవడం.. నిందితులకు శిక్షలు పడకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కామన్ కాజ్, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీకి చెందిన లోక్‌నీతీ ప్రోగ్రామ్ విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్-2023’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
సైబర్ నేరాల్లో నంబర్ వన్
సైబర్ నేరాల్లో తెలంగాణ రాష్ట్రం 10,303(2021 గణాంకాలు) కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో సైబర్ నేరాల రేటు 3.9 (52,972 కేసులు) ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో ఆ రేటు 27.3గా ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదైనా.. దర్యాప్తు అధికారులు ఐటీ చట్టాన్ని ప్రయోగించింది 655 కేసుల్లో మాత్రమే..! 9,644 కేసుల్లో ఐపీసీ సెక్షన్లను వాడారు. నిజానికి కంప్యూటర్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించి చేసే నేరాలను సైబర్ నేరాలంటారు. ఆ కోణంలోనే తెలంగాణ పోలీసులు కేసులను నమోదు చేస్తున్నా.. ఐటీ చట్టాన్ని విస్మరిస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
యూపీలో ఐటీ చట్టం
ఉత్తరప్రదేశ్‌లో 8,829 సైబర్ నేరాలు నమోదవ్వగా.. 7,586 కేసుల్లో ఐటీ చట్టాన్ని ప్రయోగించారు. చార్జిషీట్‌ల దాఖలులోనూ తెలంగాణ వెనుకంజలో ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఆయా కేసుల్లో 1,478 చార్జిషీట్లను దాఖలు చేయగా.. కన్విక్షన్ల రేటు 44.2గా ఉంది. ఢిల్లీలో కన్విక్షన్ల రేటు 100, ఉత్తరప్రదేశ్‌లో 83.2, పశ్చిమబెంగాల్‌లో 70.8గా ఉండడం గమనార్హం. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1,875 సైబర్ నేరాలు నమోదవ్వగా.. కేవలం 171 కేసుల్లో ఐటీ చట్టాన్ని ప్రయోగించారు. 363 చార్జిషీట్లను దాఖలు చేయగా.. కన్విక్షన్ల రేటు 14గా ఉంది. రాజకీయ దురుద్దేశాలతోనూ సైబర్ నేరాలు నమోదవుతున్నాయని.. 2021లో ఈ తరహా 112 కేసులతో అసోం టాప్‌లో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో 17, ఏపీలో 36 సైబర్‌క్రైమ్ కేసులను రాజకీయ దురుద్దేశాలతో నమోదు చేసినట్లు ఈ నివేదిక తెలిపింది.
సీసీటీవీ కెమెరాలున్నా..
ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సీసీ కెమెరాలను తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్నారు. 2021 గణాంకాల ప్రకారం వీటి సంఖ్య 2,82,558. అంటే.. ప్రతి ఠాణాకు సగటున 336 సీసీ కెమెరాలున్నాయన్నమాట. ఢిల్లీల్లో వీటి సంఖ్య(10,218) చాలా తక్కువ. 2016-20 కాలంలో తెలంగాణలో సీసీకెమెరాల ఆధారంగా పరిష్కరించిన కేసుల సగటు 354.5 కాగా.. ఢిల్లీలో సగటు 1,270.9 కావడం గమనార్హం. ఏపీలో 14,770 సీసీకెమెరాలు పోలీసుల పరిధిలో ఉండగా.. ప్రతి పోలీస్ స్టేషన్ సగటు 11.8 మాత్రమే. తెలంగాణలో 843 పోలీస్ స్టేషన్లకు గాను.. 429 ఠాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక(1055 ఠాణాలకు గాను.. 1052 పీఎస్ లో సీసీకెమెరాల ఏర్పాటు)తో పోలిస్తే.. ఇది చాలా తక్కువ.
