Amaravathi : అమరావతిలో పేదల పట్టాలు.. ఎల్లో మీడియా కడుపు మంట
కానీ ఎల్లో మీడియా మాత్రం వారి గురించి ప్రస్తావించడం లేదు. వారి రాజకీయం కంటే పేదలు ఇళ్ల పట్టాల కోసం ముందుకు రావడమే వారి తప్పయినట్టు భావిస్తోంది. ఎల్లో మీడియా తీరు మారనంత వరకూ వారు అభిలషించే ఏ ఒక్కదానికి ప్రజామోదం దక్కదన్న విషయం గ్రహించుకుంటే మంచిది.

Amaravathi : మీడియాలో ఎల్లో మీడియా తీరే వేరయా అన్నట్టుంది ఏపీలో పరిస్థితి. ఈ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. టీడీపీకి సేఫ్ జోన్ లో పడేయ్యాలన్న తలంపుతో అడ్డంగా బుక్కవుతోంది. తాజాగా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకీ సంబంధించి కూడా పప్పులో కాలేసింది. ఏకంగా సెంటు స్థలం ఆశిస్తున్న వారికి బెదిరింపులకు దిగుతోంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు అందిస్తున్నారని.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని అవగాహన కల్పించవచ్చు. కానీ ఏకంగా బెదిరింపులకు దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇందులో ఎల్లో మీడియా కడుపు మంట స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిని జగన్ సర్కారు నిర్వీర్యం చేయాలనుకుంది.. చేసింది. భూములిచ్చిన రైతుల ఆశలను తురిమేసింది. భవిష్యత్ పై వారు చేసుకున్న అంచనాలను తలకిందులు చేసింది. ఈ విషయంలో బాధితుల తరుపున వాదన వినిపించడంలో ఎటువంటి తప్పులేదు. కానీ బాధితుల వెర్షన్ అని కాకుండా.. తామే బాధితులమైనట్టు ఎల్లో మీడియా వ్యవహరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. సుమారు 51 వేల మందికి సీఎం జగన్ చేతులమీదుగా పట్టాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆ సభకు వెళితే మీకంటే చేతకానివారు, అసమర్థులు లేరంటూ ఎల్లో మీడియా చానల్ నుంచి ఏకంగా హెచ్చరికలే వచ్చాయి. ఒక అడుగు వేసి టీడీపీ అధికారంలోకి వస్తే ఆ పట్టాలన్నీ రద్దవుతాయని కూడా హెచ్చరించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో మరోసారి రైతులు, మహిళలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారంటూ ఎల్లో మీడియా రాసుకొచ్చింది. అయితే ఇందులో వాస్తవముంది.”ఏంటే గొంతు లేస్తోంది. ఎక్కువ మాట్లాడుతున్నావ్”.. “ఏయ్ డొక్కలు పగులుతాయ్. శిబిరం నుంచి బయటకి రండి. మీ పని చెబుతా”…మహిళా రైతులపై పోలీసుల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటిని ప్రజాస్వామిక వాదులెవరైనా ఖండించాల్సిందే. అయితే ఇదే స్పీడుతో ఎల్లో మీడియా తన నైజాన్ని బయటపెట్టేసింది. ఇళ్ల స్థలాలు తీసుకుంటున్న పేదలకు తన కర్కశం ప్రదర్శిస్తోంది.
అయితే గతంలో అమరావతి ఉద్యమాన్ని పతాక స్థాయిలో తీసుకెళ్లిన గద్దె తిరుపతిరావు, శివారెడ్డి పువ్వాడ సుధాకర్, రాయపాటి శైలజ, సుంకర పద్మశ్రీ, కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు తెనాలి శ్రావణ్ కుమార్ తదితర నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. కేవలం ఇళ్ల పట్టాలు అందుకునే పేదల వద్ద వ్యతిరేకం కాకూడదనే ప్రత్యక్ష పోరు నుంచి తప్పించుకున్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం వారి గురించి ప్రస్తావించడం లేదు. వారి రాజకీయం కంటే పేదలు ఇళ్ల పట్టాల కోసం ముందుకు రావడమే వారి తప్పయినట్టు భావిస్తోంది. ఎల్లో మీడియా తీరు మారనంత వరకూ వారు అభిలషించే ఏ ఒక్కదానికి ప్రజామోదం దక్కదన్న విషయం గ్రహించుకుంటే మంచిది.