Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై కేంద్రం సీరియస్? జగన్ కు నో పర్మిషన్?
చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దల పాత్ర ఉందో?లేదో అన్న దానిపై క్లారిటీ లేదు. అలాగని అరెస్టుపై వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎక్కువమంది నమ్ముతున్నారు.

Chandrababu Arrest: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. ఆ మధ్యన లండన్ పర్యటనలో ఉండగా చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిణామ క్రమంలో లండన్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీ వెళ్లి అగ్ర నేతలను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ నేరుగా ఏపీకే వచ్చారు. ఇలా వచ్చిన మొదటి రోజే ఢిల్లీ వెళ్తారని వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కేంద్ర పెద్దల సూచన, అనుమతి మేరకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఇప్పటికే వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అందుకే చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు వివరించేందుకు జగన్ ఢిల్లీ వెళ్తారని టాక్ నడిచింది. అయితే అదంతా ఉత్త ప్రచారమేనని తేలిపోయింది.
చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దల పాత్ర ఉందో?లేదో అన్న దానిపై క్లారిటీ లేదు. అలాగని అరెస్టుపై వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎక్కువమంది నమ్ముతున్నారు. ఇందులో కేంద్ర పెద్దల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు అరెస్టును ఖండించారు. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయడానికి తప్పుపట్టారు. పక్కన ఉన్న తెలంగాణ బిజెపి నేతలు సైతం స్పందించారు. అరెస్టు చేసే విధానాన్ని తప్పుపడుతూ ప్రత్యేక ఖండనలు ఇచ్చారు. అయితే అటు కేంద్ర పెద్దల ప్రోత్సాహం ఉంటే.. ఈ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నాయకులు స్పందిస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే జాతీయస్థాయిలో ఖండించకపోవడంతో ఒక రకమైన అనుమానం మాత్రం నెలకొని ఉంది.
దీనినే అలుసుగా తీసుకొని వైసిపి శ్రేణులు పెద్ద ప్రచారం చేస్తున్నాయి.చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దల ప్రమేయం సైతం ఉందని అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నాయి. వారి ప్రకటనలు సైతం అదే విధంగా ఉన్నాయి. అయితే జగన్ ఢిల్లీ పర్యటన తీవ్ర జాప్యం జరగడంతో ఇదంతా వైసీపీ ఎత్తుగడ అని టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నందున తప్పకుండా అపాయింట్మెంట్ లభిస్తుందని జగన్ భావించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను జగన్ కలవనున్నారని వైసీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. కానీ వారు అపాయింట్మెంట్ ఇవ్వనట్టు తెలుస్తోంది. వాటి కోసం జగన్ మనుషులు ఢిల్లీలో పడిగాపులు కాసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక సమావేశాల్లో తమ సాయం ఉంటుందని వైసీపీ భావించింది. కానీ బిజెపి నుంచి ఆ స్థాయిలో స్పందన లేకపోవడం విశేషం.
చంద్రబాబు అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు వారు ఎక్కడున్నా అరెస్టును ఖండిస్తున్నారు. ప్రజల నుంచి కూడా సానుభూతి వ్యక్తం అవుతోంది. కేంద్ర నిఘా వర్గాలు సైతం కేంద్ర ప్రభుత్వానికి ఇవే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గాని జగన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇస్తే అసలుకే మోసం వస్తుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జగన్ కు అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాజకీయ కక్షతో వ్యవహరిస్తే మున్ముందు రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. దీనిని అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
