Purandheshwari Vs Vijayasai : పురంధేశ్వరిపై విజయసాయి అటాక్ వెనుక కథ అదా?
మున్ముందు పురంధేశ్వరి విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుందో సంకేతాలు ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఒకటి కాదు అని ప్రజల్లో ఒక భావన తెచ్చేందుకే ఈ విమర్శలని.. అంతకు మించి మరొకటి లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికైతే వైసీపీ, బీజేపీల మధ్య అసలుసిసలు వైరం ప్రారంభమైందన్న మాట.

Purandheshwari Vs Vijayasai : ఏపీ బీజేపీ విషయంలో వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది. గతం మాదిరిగా ఉంటే ఇబ్బందులు తప్పవని గ్రహించినట్టుంది. అందుకే కౌంటర్ అటాక్ ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులైన సంగతి తెలిసిందే. బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా ఆమె వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్ముందు విమర్శల దాడి ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఎల్లో మీడియా సైతం ఆరోపణలను హైలెట్ చేస్తూ ఆనందంలో పరవశించింది. అయితే పురంధేశ్వరి వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టారు.. తిప్పికొట్టారు కూడా.
గత కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులపై మునుపటిలా విరుచుకుపడడం లేదు. వైసీపీ కార్యక్రమాల్లో సైతం యాక్టివ్ తగ్గించారు. ఇటీవల అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నారు. మీడియాకు సైతం పెద్దగా దొరకడం లేదు. అటువంటి నేత ఇప్పుడు పురంధేశ్వరిని టార్గెట్ చేసుకోవడం విశేషం. గతంలో రాష్ట్ర బీజేపీ నాయకుల విషయంలో విజయసాయి స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆయన ట్విట్ చూస్తుంటే రెండు పార్టీల మధ్య వైరమా? లేక నాయకుల మధ్య అన్నట్టు ఉంది.
అధ్యక్ష బాధ్యతల స్వీకరణ అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు. కేంద్ర నిధులు దారి మళ్లిస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదు. ఏపీకి రావాల్సిన నిధులు, పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వాలి. హోదా ఇవ్వండి…ఆ క్రెడిట్ అంతా మీకే ఇస్తాం. రైల్వేజోన్ మంజూరు చేయాలి. వైజాగ్ స్టీల్ ప్రయివేటీకరణ ఆపండి. పోలవరం ప్రాజెక్ట్, చెన్నై-వైజాగ్ కారిడార్ పూర్తి చేయండి. రైతు సంక్షేమానికి మద్దతు ఇవ్వండి అంటూ ట్విట్టర్ లో కోరారు.
వైసీపీ సర్కారుపై బీజేపీ ఎటువంటి ఆరోపణలు చేసినా పెద్దగా కౌంటర్ ఇవ్వలేదని భావించారు. అందుకే పురంధేశ్వరి తొలి సభలోనే ఘాటైన విమర్శలు చేశారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం గట్టిగానే రిప్లయ్ ఇచ్చారు. మున్ముందు పురంధేశ్వరి విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుందో సంకేతాలు ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఒకటి కాదు అని ప్రజల్లో ఒక భావన తెచ్చేందుకే ఈ విమర్శలని.. అంతకు మించి మరొకటి లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికైతే వైసీపీ, బీజేపీల మధ్య అసలుసిసలు వైరం ప్రారంభమైందన్న మాట.
