Chandrababu Arrest: చంద్రబాబును జైలుకు పంపాలన్న జగన్ కల తీరినట్టేనా?
అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ఎలాంటి ఉద్దేశ్యాలు ఉన్నప్పటికీ .. ప్రధాన కారణం మాత్రం వేరే ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తన సంస్థలో పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది.

Chandrababu Arrest: అవి కరుణానిధి తమిళనాడు రాష్ట్రాన్ని ఏలుతున్న రోజులు.. వ్యక్తి పూజ, ప్రాంతీయ పూజ ప్రబలంగా ఉండే తమిళనాడు ప్రాంతంలో.. వ్యక్తిగతహననాలకు కొదువ ఉండేది కాదు. అలాంటి సమయంలో తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన జయలలితను కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సభలో డీఎంకే నేతలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఆమె చీరను లాగారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక కురు సభను తలపించింది. తనకు జరిగిన అవమాన భారాన్నే జయలలిత తదుపరి ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మల్చుకుంది. ఆ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధిని అరెస్టు చేయించింది. చెన్నై సెంట్రల్ జైల్లో చిప్పకూడు తినిపించింది. ఒక ఆడదానికి ఆగ్రహం వస్తే ఆమె క్రౌర్యం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పింది. ఆ దెబ్బకు డీఎంకే కాకా వికలం అయిపోయింది. కరుణానిధి పెద్ద కుమారుడు అలగిరి తిరుగుజెండా ఎగరవేశాడు. స్టాలిన్ బయటికి రాలేకపోయాడు.. ఇక ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
తమిళనాడు లాగానే దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుతం ఇటువంటి పోకడలే కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించి జరిగిన అవకతవకలలో అప్పటి ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లిన తర్వాత ఈ అరెస్టు పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అయితే దీనిపై అధికార వైఎస్ఆర్సిపి చెప్తున్న వివరాలు ఒక రకంగా ఉంటే.. ప్రతిపక్ష టీడీపీ చెప్తున్న విషయాలు మరో విధంగా ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో అక్రమాలకు పాల్పడ్డారని, 100 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారని అధికార వైఎస్ఆర్సిపి ఆరోపిస్తోంది. ఇన్నాళ్లు పలు కేసుల విషయంలో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తుతోంది. మరోవైపు అసలు ఎటువంటి ముడుపులు ఇవ్వలేదని ఆ కాంట్రాక్టు సంస్థ చెబుతున్నప్పటికీ.. చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయాలని ఒకే ఒక కారణంతో అధికార వైఎస్ఆర్సిపి అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి ఆరోపిస్తోంది. ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేని చంద్రబాబునాయుడుని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తోంది.
అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ఎలాంటి ఉద్దేశ్యాలు ఉన్నప్పటికీ .. ప్రధాన కారణం మాత్రం వేరే ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తన సంస్థలో పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. 16 నెలల పాటు చంచల్ గూడ జైల్లో ఉంచింది. ఒకరకంగా ఈ పరిణామంతో జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయన భార్య, తల్లి, సోదరి రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జగన్ మోహన్ రెడ్డి మరింత కసిగా పని చేయడం ప్రారంభించారు. చెప్పినట్టుగానే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కట్టించిన ప్రజావేదికను కూల్చివేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆర్థిక స్థంబాలపై ఎక్కుపెట్టారు. చంద్రబాబు నాయుడు అనుయాయులపై ఉన్న కేసులను తిరగతోడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పై స్కిల్ డెవలప్మెంట్ అవకతవకల కేసు పెట్టారు. అర్ధరాత్రి పూట అత్యంత నాటకీయ పరిణామాలు మధ్య అరెస్టు చేశారు. అయితే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన అరెస్టుకు తెరవెనుక కారణం చంద్రబాబు అనేది జగన్ ప్రధాన ఆరోపణ. చంద్రబాబు నాయుడు తెరవెనక సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించారని ఆయన వర్గం నాయకులు చెబుతుంటారు. ప్రస్తుతం అదును చూసి జగన్ దెబ్బ కొట్టారని వారు అంటున్నారు. ఈ అరెస్టు ద్వారా చంద్రబాబును జైలుకు పంపాలనే జగన్ కల తీరిందని వారు పేర్కొంటున్నారు.
ముందుగానే చెప్పినట్టు తమిళనాడు ప్రాంతంలో ఒకప్పుడు ప్రతీకార రాజకీయాలు రాజ్యమేలేవి. హత్యలు, వేధింపులకు గురి చేయడాలు నిరాటంకంగా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికార, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలు ఈ స్థాయిలో ఉండేవి కాదు. ఇద్దరు కూడా ఒకే వేదిక పంచుకునేవారు. నవ్వుతూ మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పలకరించుకోవడం కాదు కదా కనీసం పరస్పరం ముఖం చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. దీనికి తోడు కుటుంబ సంబంధీకుల వ్యవహారాలు కూడా నడి బజార్లో పెడుతున్నారు. ఎన్నికల ముందే ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే భయం వేస్తుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
